అమరావతి: అన్యాయంగా అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు మాజీమంత్రి, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు. తనను సస్పెండ్ చేయడంపై స్పీకర్‌కు లేఖ రాశారు. 

ప్రశ్నోత్తరాల సమయంలో తమ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో తమ సభ్యులు నిరసన తెలిపారని లేఖలో పేర్కొన్నారు. తమ సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో తన స్థానంలో నిల్చొని నిరసన తెలిపానని అచ్చెన్నాయుడు లేఖలో వివరించారు. 

అయితే మా శాసన సభ్యులు నిరసన తెలియజేయు సమయంలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానంలో తన పేరు ఉండటంపై ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు. 

మంగళవారం శాసన సభలో తాను శాసన సభ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అయినా గానీ సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు పంపించి వేశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లోనే ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. ఎలాంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు. 

అలాంటిది తనను అకారణంగా సస్పెండ్ చేశారని, మార్షల్స్‌తో బయటకు పంపి అవమానించారని లేఖలో పేర్కొన్నారు. శాసన సభ్యుడిగా తనకున్న హక్కులను హరించడాన్ని తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. తనపై సస్పెన్షన్ వేటును మరోకసారి పరిశీలించి తనపై అన్యాయంగా తీసుకున్న చర్యను పున: పరిశీలించాలంటూ లేఖలో కోరారు మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.  

ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీ నుంచి సస్పెన్షన్.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

సస్పెన్షన్ ఎత్తివేయండి... డిప్యుటీ స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ... ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్