ఆడుదాం ఆంధ్రా స్కామ్ పై స్పందించిన రోజా

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి మీడియా ఎదుట స్పందించారు మాజీ మత్రి ఆర్కే రోజా. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. ఇంకా ఏమన్నారంటే...

Ex Minister Roja Responce On Adudham Andhra Scam GVR

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు ఆపి.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై తెలుగుదేశం నేతలు దృష్టి సారించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రిషికొండపై నిర్మించిన భవనాలు పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలని స్పష్టం చేశారు. తామేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదని విమర్శించారు. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో రుషికొండపై పర్యాటక శాఖ భవనాలు నిర్మించామని తెలిపారు.

Ex Minister Roja Responce On Adudham Andhra Scam GVR

రోజా ఇంకా ఏమన్నారంటే....

‘‘టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్‌ కాలేజీలు, నాడు-నేడు స్కూల్స్‌, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా?. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణతోనే నిర్మాణాలు చేపట్టాం.

ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్‌ ఇలా కూడా అవుతుందా..? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా..? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశామనడం హాస్యాస్పదమే అవుతుంది. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయవచ్చు అని అనలేదా..?’’ అంటూ మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. 

ఆర్కే రోజా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా రోజా... ఈసారి దారుణమైన ఓటమిని చవిచూశారు. నగరి నియోజకవర్గంలో వైసీపీలోని కొన్ని వర్గాలే రోజాను వ్యతిరేకించాయి. రోజా ఓడిపోయాక సంతోషం వ్యక్తం చేస్తూ.. బహిరంగంగా వీడియోలు విడుదల చేశారు వైసీపీ నాయకులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios