టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. బాబు, లోకేష్‌లు ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని పేర్ని నాని చురకలంటించారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైందన్నారు. 2016 నుంచి చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారని నాని ఆరోపించారు. పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని.. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని.. మనోజ్ పార్ధసాని ముడుపులు ఇచ్చినట్లు తేలిందని నాని ఆరోపించారు. ఈ ముడుపులను దాచి వుంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఆయన ప్రశ్నించారు.
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారని..చంద్రబాబుకు నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించం లేదని పేర్ని నాని నిలదీశారు. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికి కనిపించదని ఆయన చురకలంటించారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని.. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా.. కాదా .. అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీతపై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: చంద్రబాబుకు షాక్: ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీస్
బాబు, లోకేష్‌లు ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారని ఆయన ఆరోపించారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా అని పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబేనని.. భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు.
