చంద్రబాబుకు షాక్: ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీస్
చంద్రబాబునాయుడుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 4న ఆదాయపన్ను శాఖ ఈ నోటీసును జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఈ విషయమై పలు తెలుగు న్యూస్ చానెల్స్ కూడ వార్తలను ప్రసారం చేశాయి.
ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్లు చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఐటీ శాఖకు చంద్రబాబునాయుడు పంపిన వివరణను ఐటీ శాఖ తిరస్కరించిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుండి వచ్చిన రూ. 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించింది. హైద్రాబాద్ కు చెందిన ఐటీ శాఖ సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది.
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందనే ఊహగానాలు సాగుతున్న తరుణంలో ఈ నోటీసుల అంశం వెలుగు చూసింది. ఈ ఏడాది జూన్ మాసంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. గత నెల చివరలో ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయాల స్మారక నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు ముచ్చటించారు.ఐటీ శాఖకు చెందిన సీబీడీటీ ఇచ్చిన మెయిల్ కు స్పందించలేదని ఈ కథనం తెలిపింది.
2019 నవంబర్ లో షాపూర్‌జీ పల్లంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం ఆధారంగా 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు అప్పటి పీఏ శ్రీనివాస్ నివాసంలో కూడ ఐటీ శాఖాధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో లభ్యమైన ఆధారాల మేరకు ఐటీ శాఖాధికారులు విచారణ నిర్వహించారు.
ఈ సోదాల్లో వాట్సాప్ చాట్ లు, ఎక్సెల్ షీట్ లను కూడ ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు. చంద్రబాబు కోసం ఆయన పీఏ గా ఉన్న శ్రీనివాస్ కు డబ్బులు డెలీవరి చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన చాటింగ్, ఎక్సెల్ షీట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని ఆ కథనం వివరించింది. బోగస్ వర్క్ ఆర్డర్లను జారీ చేసి, సబ్ కాంట్రాక్టులను సృష్టించి డబ్బులు చెల్లించారని ఐటీ శాఖ ఆరోపించిందని ఆ కథనం తెలిపింది.