మా డేటా సచివాలయంలోనే వుంది .. దమ్ముంటే విచారణ చేయించు : పవన్ కళ్యాణ్‌కు పేర్ని నాని సవాల్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న డేటా మా సెక్రటేరియట్‌లో వుందన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. దమ్ముంటే డేటా చౌర్యం జరిగిందని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వం, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చెబుతున్న డేటా మా సెక్రటేరియట్‌లో వుందన్నారు. దీనిలో తప్పుంటే మోడీ, అమిత్ షాలతో కలిసి నిరూపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ మంచిగా మూడు పూటలు షూటింగ్‌లు చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఇందులో పవన్ కల్యాణ్‌కు రిస్క్ ఏముందని.. ఆయనపై పెట్టుడి పెట్టిన చంద్రబాబుకు రిస్క్ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్‌ను కొడితే చంద్రబాబు కొట్టాలి లేదంటే అమిత్ షా కొట్టాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్‌వి అన్ని సొల్లు కబుర్లని పేర్ని నాని దుయ్యబట్టారు. 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమగ్ర ప్రజా సాధికారత పేరుతో సర్వే చేసి ఏపీ ప్రజల డేటాను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని నాని ఆరోపించారు. అప్పుడు పవన్ పవన్ నోరు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆ డేటాను హైదరాబాద్‌కు పంపిస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని పేర్ని నాని వెల్లడించారు. పవన్ చెబుతున్న ఆ ఎఫ్ఓఏ ఎవరిదో .. ఆ మూడు కంపెనీలు ఎవరివో మీరే తేల్చాలంటూ ఆయన దుయ్యబట్టారు.
సభ్యత్వం పేరుతో జనసేన సేకరిస్తున్న డేటా అంతా ఎక్కడికి వెళ్తుందని పేర్ని నాని ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వానికి ఫోన్ నెంబర్, ఈ మెయిల్ , ఓటర్ కార్డ్ నెంబర్ ఎందుకు అని ఆయన నిలదీశారు. సెన్సస్ పేరుతో కేంద్రం అన్ని వివరాలు ఎందుకు సేకరిస్తోందని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం బతుకుతున్నాడని దుయ్యబట్టారు. వాలంటీర్లను తిడుతూ వాళ్లకు అండగా వుంటానంటాడని ఆయన ఎద్దేవా చేశారు. అమిత్ షాతో, మోడీతో మాట్లాడితే ఎవడికి గొప్ప అని పేర్ని నాని నిలదీశారు.
మనలో విషయం లేనప్పుడు నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అంటాడని.. ఖలేజా వున్నాడో రా చూసుకుందాం అంటాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్, మోడీలు కలిసి చేతనైంది చేసుకోవాలంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. కేంద్రంలోనూ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ పేరుతో మోడీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. వారికి నెలకు రూ. 8,389 జీతం ఇస్తున్నారని .. వాళ్లు వాలంటీర్లు కాదని మోడీతో అనగలవా అని పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేరు.. ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేరంటూ పవన్‌కు చురకలంటించారు. ఎనిమిదేళ్లుగా మోడీ నన్ను ఏనాడూ పిలవలేదని నువ్వే చెప్పావ్ అంటూ నాని ఎద్దేవా చేశారు.
ALso Read: జగన్‌ను ఇంటికి పంపుతా.. కుదిరితే చర్లపల్లి జైలుకు కూడా : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్‌కు మాటలెక్కువ, చేతలు తక్కువంటూ నాని సెటైర్లు వేశారు. వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఆ శాఖ కోర్టులో పవన్‌పై దావా వేసిందని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఆయన చేసినది తప్పయితే కోర్టే అరెస్ట్ చేయిస్తుందని నాని జోస్యం చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ బలంగా వుండటం చూసి తట్టుకోలేక పవన్ కల్యాణ్ బురద జల్లుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడేశానని.. నిర్ణయం జరిగిపోయిందని పవన్ అంటున్నారని నాని మండిపడ్డారు. అమిత్ షాతో మాట్లాడితే జగన్ పని అయిపోయిద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను దమ్ముంటే జైలుకు పంపాలంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. చేతనైతే బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని నాని కామెంట్ చేశారు. మీ మధ్య వున్నది నిజంగా పొత్తా.. లేదంటే డమ్మీ పొత్తా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.