గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులు సహా 16నెలల వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దారుణాలు, ఆకృత్యాలను ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు పదేపదే తప్పుపడుతున్నాయని, వీటన్నింటి నుంచీ ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో అర్థం పర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. 

బుధవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదానికి కూడా ఆధారాలు లేవన్న మాజీమంత్రి ప్రజలనుంచి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటిపదాలు జగన్, విజయసాయిలకు తప్ప రాష్ట్రప్రజలకు తెలియవన్నారు. రైతులు భూములిస్తే, వాటిని అభివృద్ధి చేసి తిరిగివ్వడమే ఒప్పందమని, దానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడుందన్నారు. 

రాష్ట్ర విభజన జరిగాక గుంటూరు–విజయవాడ ప్రాంతంలో రాజధాని వస్తుందని అందరూ అనుకున్నారని, ఆ నేపథ్యంలో ధరలు పెరుగుతాయన్న ఆశతో కొందరు భూములు కొంటే దాన్ని టీడీపీకి ఆపాదించి బురదజల్లే కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం కొసాగిస్తోందన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో మాజీ మంత్రి లోకేష్ అవినీతి చేశాడంటున్న వైసీపీ బ్యాచ్, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలయినప్పుడు ఆయన మంత్రిగానే లేడనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు. ఆ ప్రాజెక్ట్ కింద మొత్తం పెట్టిన ఖర్చే రూ.700కోట్లయితే, రూ.2వేలకోట్లని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారన్నారు.  ఈ విధంగా ప్రతి అంశాన్ని మసిపూసి మారేడుకాయచేస్తూ టీడీపీపై గుడ్డకాల్చి వేయడమే వైసీపీపనిగా పెట్టుకుందన్నారు.

read more  జగన్ కు డిక్లరేషన్ సెగ: తిరుపతిలో ఉద్రిక్తత, నేతల హౌస్ అరెస్టులు

ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో కూడా తెలుసుకోకుండా, కేసులుభయంతో జగన్మోహన్ రెడ్డి, టీడీపీపై, చంద్రబాబుపై  నిందారోపణలు చేస్తున్నాడన్నారు. అవినీతి, క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఎప్పుడో 2010లోనే పిల్ వేశారని, అది ఇప్పుడు విచారణకు రావడంతో రాష్ట్ర పాలకుల్లో వణుకు మొదలైందన్నారు.

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేస్తే కోర్టులు ఒప్పుకోవని తెలిసీ ముందుకెళ్లారని, ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలనే నిబంధన కూడా కేంద్ర విద్యాహక్కు చట్టంలో ఉందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని తొలగిస్తే, అధికారులు కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని తెలిసికూడా గుడ్డిగా ఎస్ఈసీని తొలగించడానికి యత్నించారన్నారు.  ఈ విధంగా కావాలనే చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకొని భంగపడిన ప్రభుత్వం, కోర్టులను కూడా దూషించే స్థాయికి చేరిందన్నారు. 

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడమనేది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమని... జగన్ అన్యమతస్తుడైనా సెక్యులర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి, ఆవేశకావేశాలతో మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూడటం సరికాదని ఆనందబాబు హితవు పలికారు. జగన్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసని, ఆయనకు నమ్మకం ఉండబట్టే తిరుమల వెళుతున్నాడు కాబట్టి తన అంగీకారాన్ని, స్వామివారిపై తనకున్న విశ్వాసాన్ని తెలియచేస్తూ డిక్లరేషన్ చేస్తే తప్పేముంటుందని టీడీపీనేత ప్రశ్నించారు. అంతగా తిరుమల వెళ్లడం ముఖ్యమంత్రికి ఇష్టంలేకుంటే వేరేవారిని పంపిస్తే సరిపోయేదానికి, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మూర్ఖత్వంతో వ్యవహరించడం సరికాదన్నారు. 

నూటికి 80శాతం దళితులు జగన్ కు ఓటేశారని, అందుకు ప్రతిఫలంగా వారు అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, దాడులను వైసీపీ ప్రభుత్వంలో బహుమతిగా పొందుతున్నారన్నారు.  అంబేద్కర్ స్మృతివనంలో చోరీకీ గురైన అంబేద్కర్ విగ్రహాల ఆచూకీ ఇంతవరకు లభించలేదని, దానిపై ఈ ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పాలన్నారు. స్మృతివనం ప్రాజెక్ట్ ను పథకం ప్రకారం చంపేసే క్రమంలో ప్రభుత్వమే విగ్రహాలను దొంగతనం చేయించిందని ఆనందబాబు తేల్చిచెప్పారు. 

పాలకులు అనేవారు ప్రజల సమస్యలపై, రాష్ట్ర అభివృధ్దిపై దృష్టిపెట్టాలిగానీ, ప్రతిపక్షంపై, ప్రజలపై కక్షసాధింపులకు పాల్పడకూడదన్నారు. కేంద్రం మెడలు వంచి, ప్రత్యేకహోదా తెస్తానన్నవారు, కేంద్రం అడగకుండానే అన్ని బిల్లులకు గుడ్డిగా మద్ధతు తెలుపుతున్నారన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు బిగించే నిబంధనను కాదంటే, కేంద్రమిచ్చే అప్పుకోసం జగన్ ఆ నిర్ణయాన్ని అమలుచేయడానికి సిద్ధపడ్డాడన్నారు. ఈ విధంగా ప్రతిఅంశంలో కేంద్రం తానా అంటే వైసీపీ ప్రభుత్వం తందానా  అంటోందన్నారు.