తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ బుధవారం తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బిజెపి నేతలూ కార్యకర్తలూ ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ అన్యమతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బిజెపి, టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. 

పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనుషా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇతర నాయకుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆందోళనకు దిగడానికి టీడీపీ, బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారు. పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలావుంటే, హైదరాబాదులో జగన్ నివాసం లోటస్ పాండ్ ముట్టడికి భజరంగ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో లోటస్ పాండు వద్ద భద్రత పెంచారు. 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్ నేరుగా తిరుపతి చేరుకుంటారు. ఆయన తిరుపతి పర్యటనలు స్వల్ప మూర్పులు జరిగాయి.