గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషనర్ పదవిపై ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వివాదం సాగుతోంది. ఈ తరుణంలో రమేష్ కుమార్ తో బిజెపి నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ఇటీవల హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో సమావేశమైనట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు, టిడిపిలపై విమర్శలు చేశారు. ఆ విమర్శలను కొట్టిపారేసిన మజీ మంత్రి జవహర్ ఎమ్మెల్యే అంబటికి ఘాటు రిప్లై ఇచ్చారు. 

''సొంత కార్యకర్తలే నియోజకవర్గంలో తాట తీస్తాం అని వార్నింగ్ ఇవ్వడంతో అంబటికి మతి భ్రమించింది. నిమ్మగడ్డని పదవిలోంచి తొలగించాం అని మీరే సెలవిచ్చారు ఇప్పుడు పదవికి రాజీనామా చెయ్యాలి అంటున్నారు ఇందులో ఏది నిజం రాంబాబు గారు'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు జవహర్. 

''వ్యవస్థల్ని నాశనం చేసి చిప్పకూడు తినడం, సంతకాలు పెట్టిన అధికారులను తనతో పాటు జైలుకి తీసుకెళ్లడం జగన్ రెడ్డి లక్షణం. కమలం పార్టీ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నారు. మీ నోటి దురదని చంద్రబాబు గారిపై తీర్చుకోవడం ఎందుకు అంబటి'' అంటూ సీఎం జగన్, ఎమ్మెల్యే అంబటిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

read more  శకుని మామా! కమ్మ కాదు... డిల్లీ బాస్ అనే దమ్ముందా?: విజయసాయిపై బుద్దా ఆగ్రహం
 
అంతకుముందు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వీరంతా చంద్రబాబుతో 24 గంటలు టచ్‌లో ఉంటారని, ఆయనను కాపాడేందుకే బీజేపీలో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. వీరిద్దరూ కమల వనంలో పచ్చ పుష్పాలని.. రమేశ్ కుమార్‌తో పార్క్‌హయత్‌లో గంటపాటు ఎందుకు చర్చించారని రాంబాబు ప్రశ్నించారు. 

ఎస్ఈసీ‌గా కొనసాగింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసు వేసిన రమేశ్ కుమార్ లాయర్లకు ఫీజులు చెల్లించగలరా అని ఆయన నిలదీశారు.ఆ డబ్బంతా చంద్రబాబు జేబులో డబ్బేనని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి  మాట్లాడుకుని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారా? అని నిలదీశారు.

రమేశ్ కుమార్ కోసమే కామినేని హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఇద్దరి పిల్స్‌లో ఉన్న సారాంశం ఒక్కటేనని అంబటి ఆరోపించారు. రమేశ్‌ కుమార్‌ను తక్షణం అరెస్ట్ చేసి విచారించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు.

ఉదయం నుంచి టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలకు సంబంధించి ముగ్గురిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడలేకపోతున్నారని రాంబాబు ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉంటూ రాజకీయ పార్టీల నేతలతో ఓ ప్రైవేట్ హోటల్‌లో భేటీ అవ్వాల్సిన అవసరం రమేశ్ కుమార్‌కు ఏంటని అంబటి నిలదీశారు.