విజయవాడ: గతకొన్ని రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సీఈసీ పదవి, రమేష్ కుమార్ విషయమై మాటలయుద్దం సాగుతోంది. తాజాగా రమేష్ కుమార్ హైదరాబాద్ లో కొందరు బిజెపి నాయకులతో సమావేశమైనట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో మరోసారి ఈ వ్యవహారం ఏపి రాజకీయాల్లో మాటల యుద్దానికి తెరతీసింది. 

రమేష్ కుమార్ తో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ల మధ్య రహస్య సమావేశం జరిగినట్లు బయటపడ్డ వీడియోపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ''పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు.ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?మరిన్ని వివరాలు అతి త్వరలో...'' అంటూ ఆయన  ట్వీట్ చేశారు. 

read more   కామినేని, సుజనాలతో భేటీ: అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ, చంద్రబాబు ట్విస్ట్

దీనిపై టిడిపి ఎమ్మెల్సీ, అధికార ప్రతినిది బుద్దా వెంకన్న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ''శ‌కుని మామా! నీ అల్లుడు వైఎస్ జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్ర‌యోగించి తొల‌గించిన ఎస్ఈసీని చేర్చుకోవాల‌ని కోర్టు ఆదేశించినా ప‌ట్టించుకోకుండా, ఇప్పుడాయ‌న ఎవ‌రితో క‌లిస్తే నీకేంటి? క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే కానీ! క‌మ‌లం అనే ప‌దం ప‌ల‌కాల‌న్నా వ‌ణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?'' అంటూ ట్విట్టర్ వేదికనే విజయసాయిని ప్రశ్నించారు. 

అంతకుముందు ''రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు, దమ్ములేని మాట చూడు, తొంటి చేతి వాచీ చూడరా అని వైకాపా కార్యకర్తలు ఏడుస్తూ పాడుతున్నారు. మీ చెవిన పడలేదా విజయసాయి రెడ్డి గారు'' అంటూ ఎద్దేవా చేశారు.

''ప‌బ్జీ ఆట‌కు పోతురాజు.. ప‌నిచేయ‌డానికి తిమ్మరాజు అని సొంత ఎంపీ అంటున్నారు వైఎస్ జగన్ ని. మీరేమో ట్వీట్లతో జాకీలేసి లేపి ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటారు. ఆయ‌న తాడేప‌ల్లి గ‌డ‌ప‌దాటి రారు'' అని సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై సోషల్ మీడియాలో బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.