లోకేష్ పొర్లు యాత్రలు చేసినా నో యూజ్, పవన్ తీవ్రవాదైతే కాల్చిపడేస్తారు : కొడాలి నాని చురకలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌లు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. బతికి వున్నంత వరకు ఏపీకి జగనే సీఎం అని కొడాలి నాని జోస్యం చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే కాల్చిపడేస్తారని ఆయన హెచ్చరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే ప్రజలను చంపేస్తాడా అని కొడాలి నాని ప్రశ్నించారు. పవన్ రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన పార్టీల చంక ఎందుకు ఎక్కాడని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలు పాదయాత్రలే కాదు, పొర్లు యాత్రలు చేసినా ప్రజలు పట్టించుకోరని కొడాలి నాని దుయ్యబట్టారు. రాష్ట్రం ముక్కలు కాకుండా వుండేందుకే మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకొచ్చామని ఆయన తెలిపారు.
చంద్రబాబు, పవన్‌లు లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి అసలు ఎందుకు రావాల్సి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. వైసీపీకి 55 శాతం ఓటు బ్యాంక్ వుందని.. అందరూ కట్ట కట్టుకుని వచ్చినా తమ వెంట్రుక కూడా పీకలేరని ఆయన చురకలంటించారు. బతికి వున్నంత వరకు ఏపీకి జగనే సీఎం అని కొడాలి నాని జోస్యం చెప్పారు. గుడివాడలో క్యాసినో వుందని రాద్దాంతం చేశారని.. చివరికి తన చిటికెన వేలు మీద వెంట్రుక అయినా పీక గలిగారా అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్స్‌లో అమ్మాయిల ముందు మందు కొట్టడం కాదంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు.
Also Read: ఏపీని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం.. ప్రజలు విసిగిపోయారు: పవన్ కల్యాణ్
కాగా.. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?.. రాజ్యాంగం గురించి ఏం తెలుసు అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదం గురించి మాట్లాడితే తన అంత తీవ్రవాది ఉండడని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు.
తన బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి తాను పార్టీ ప్రారంభించానని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన కార్యాలయానికి రావొచ్చని అన్నారు. బ్రిటీష్‌వారు పోయినా వాళ్ల అహంకార ధోరణి ఇంకా పోలేదని అన్నారు. తాను అవగాహన లేకుండా దేనిపైనా మాట్లాడనని చెప్పారు. యూనివర్సిటీల్లో చదవకపోయినా నోటికి వచ్చినట్టుగా మాట్లాడనని అన్నారు. కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తానని చెప్పారు.
ఒక చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని అన్నారు. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదన్నారు. యువత ఇప్పుడు బయటకు రాకుంటే, అన్యాయాన్ని ఎదుర్కొకపోతే బానిసల్లా ఉండిపోతారని అన్నారు. ‘‘పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. పార్టీ నిర్మాణానికి సమయం పడుతుంది. పెరుగు తోడు వేస్తే.. అది తోడుకోవడానికి రాత్రి సమయం పడుతుంది. పార్టీ నిర్మాణంపై దశాబ్దం పాటు వేచిచూసిన తర్వాత.. అప్పుడు ఎటూవైపు వెళ్తుందో చూసుకుందాం’’ అని పవన్ అన్నారు.