Asianet News TeluguAsianet News Telugu

ఏపీని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం.. ప్రజలు విసిగిపోయారు: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. 
 

Pawan kalyan Sensational Comments On YSRCP
Author
First Published Jan 26, 2023, 1:32 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారాహి రోడ్డు మీదకు రానివ్వమని నానా రచ్చ చేశారని.. ఆపేస్తామని మాట్లాడారని.. అయితే తమను ఎవరూ ఆపలేరని అన్నారు. డబ్బులు దోచుకుని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించేవారికే అంతుంటే.. ఏ తప్పు చేయని తనకెంతా ధైర్యం ఉండాలని అన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అన్నారు. చట్టానికి అతీతంగా హత్యలు, కోడి కత్తితో పొడిపించుకుని డ్రామాలు చేయనని అన్నారు. చట్టాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని చెప్పారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో  పవన్ కల్యాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తన బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి తాను పార్టీ ప్రారంభించానని చెప్పారు.  ప్రజలకు ఏ  సమస్య వచ్చినా జనసేన కార్యాలయానికి రావొచ్చని  అన్నారు. బ్రిటీష్‌వారు పోయినా వాళ్ల అహంకార ధోరణి ఇంకా పోలేదని అన్నారు. తాను అవగాహన లేకుండా దేనిపైనా మాట్లాడనని చెప్పారు. యూనివర్సిటీల్లో చదవకపోయినా నోటికి వచ్చినట్టుగా మాట్లాడనని అన్నారు. కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తానని చెప్పారు. 

ఒక చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని అన్నారు. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదన్నారు.  యువత ఇప్పుడు బయటకు రాకుంటే, అన్యాయాన్ని ఎదుర్కొకపోతే బానిసల్లా ఉండిపోతారని అన్నారు. ‘‘పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. పార్టీ నిర్మాణానికి సమయం పడుతుంది. పెరుగు తోడు వేస్తే.. అది తోడుకోవడానికి రాత్రి సమయం పడుతుంది.  పార్టీ నిర్మాణంపై దశాబ్దం పాటు వేచిచూసిన తర్వాత.. అప్పుడు ఎటూవైపు వెళ్తుందో చూసుకుందాం’’ అని పవన్ అన్నారు. 

రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?.. రాజ్యాంగం గురించి ఏం తెలుసు అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదం గురించి మాట్లాడితే తన అంత తీవ్రవాది ఉండడని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. 

వైసీపీ నాయకులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే తన అంతా తీవ్రవాది ఉండడని అన్నారు. తనకు భయాలు లేవని, జీవితంలో ఏం ఆశించనని, ప్రాణాలంటే లెక్కలేదని అన్నారు. వైసీపీ నాయకులు తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పదవి రాలేదని రాష్ట్రాన్ని విడగొట్టేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు?.. ఆ ప్రాంత అభివృద్ది గురించి ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలా?.. అలాంటి పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్స్ ఇవ్వద్దని కోరారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios