విశాఖపట్నం: స్వార్థ రాజకీయాల కోసం అతి పవిత్రమైన తిరుమలను వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ అప్రతిష్ట పాలు చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత  బండారు సత్యనారాయణ ఆరోపించారు.

 తిరుమల పవిత్రతను, సాంప్రదాయాలను కొందరు దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తిరుమల కొండపైకి అన్యమతస్తులు వెళితే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలని... అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని తొలగించాలన్న కుట్ర జగన్ ప్రభుత్వం పన్నిందని అన్నారు. 

read more  డిక్లరేషన్ రగడ: అందుకే జగన్‌కు అక్కర్లేదన్నాను... వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనుకునే సీఎం జగన్ కు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే హక్కు లేదని బండారు వ్యాఖ్యానించారు. గత బ్రహ్మోత్సవాల్లో కూడా జగన్ సతీసమేతంగా కాకుండా ఒక్కరే ఉత్సవాలకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు.  ఈ ఏడాది కూడా సీఎం జగన్ ఒంటరిగా వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.

ఇక సీఎం జగన్ కూడా తిరుమల కొండకు వచ్చినపుడు తప్పకుండా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మం దెబ్బతింటున్నా... శారదాపీఠం స్వామి మౌనం వహిస్తున్నారెందుకని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.