మంత్రి బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదన్న ఆయన.. వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ విశాఖ వచ్చుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు.

ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన నేతల్లో బొత్స ఒకరని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఆనాడు వోక్స్ వాగన్ ఫ్యాక్టరీ విశాఖ వచ్చుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెంది, వేలాదిమందికి ఉపాధి లభించేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ఆ పదవి దక్కదనే అక్కసుతోనే ఆవేశం: లోకేష్‌పై విజయసాయి సెటైర్లు

జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారని, వైఎస్ చనిపోవడానికి జగనే కారణమని, ఇప్పుడేమో జగన్‌కు భజన చేస్తున్నారని అయ్యన్న ధ్వజమెత్తారు. గతంలో బొత్స కూడా బ్రాందీ వ్యాపారమే చేశారని,  జనం ప్రాణాలు పోయినా పర్లేదని.. కానీ వైసీపీ ప్రభుత్వానికి ఆదాయం కావాలా అని అని నిలదీశారు.  

విశాఖలో పేదల భూములు దోచేస్తున్నారని చంద్రబాబుకి తాను నేరుగా చెప్పానని.. కానీ బ్రాందీ పేరుతో విషం అమ్మొద్దని ముఖ్యమంత్రికి బొత్స ఎందుకు చెప్పడం లేదని అయ్యన్న నిలదీశారు.

చంద్రబాబు సిట్ వేస్తే కాదు కాదు సీబీఐ విచారణ జరిపించాలని ఆనాడు విజయసాయి మాట్లాడారని.. సిట్ రిపోర్టును వైసీపీ ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పేదలకు పట్టెడన్నం  పెట్టే అన్నక్యాంటీన్లను రద్దు చేశారని.. కరోనా సమయంలో అన్న క్యాంటీన్లు ఉంటే ఎంతో ఉపయోగపడేవని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read;అసెంబ్లీని బ్లీచింగ్ పౌడర్ తో నింపేస్తే ఊరుకోం...:ప్రభుత్వానికి నిమ్మల హెచ్చరిక

చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయని.. వైసీపీ ఏడాది పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని అయ్యన్న ఆరోపించారు. వైసీపీ నేతలు రాజధానిని ఏడారి అంటున్నారని.. మిమ్మల్ని 70 సార్లు మొట్టికాయలు వేసిన హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ అక్కడే ఉన్నాయని అన్నారు.

రాజధాని కోసం 42 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ఏం చేద్దామనుకుంటున్నారని అయ్యన్న ప్రశ్నించారు. 175 రోజులుగా వారంతా నిరాహారదీక్షలు చేస్తుంటే మీరసలు ఒక్కసారైనా వారి దగ్గరకు వెళ్లారా.. కనీసం స్థానిక ఎమ్మెల్యే అయినా రైతుల గోడు విన్నారా అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.