Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీని బ్లీచింగ్ పౌడర్ తో నింపేస్తే ఊరుకోం...:ప్రభుత్వానికి నిమ్మల హెచ్చరిక

వైసిపి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 

TDP MLA Nimmala Ramanaidu Comments on assembly budget sessions
Author
Guntur, First Published Jun 9, 2020, 12:20 PM IST

గుంటూరు: వైసిపి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వైసీపీ ఏడాది పాలనంతా స్కాముల మయమేనని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.87వేల కోట్లు అప్పుచేసి ఏం అభివృద్ధి చేశారు? అంటూ జగన్ ప్రభుత్వాన్ని రామానాయుడు నిలదీశారు. 

''తొలి పది నెలలు జగోనాతో, చివరి రెండు నెలలు కరోనాతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తొలి కేసు నమోదైన కేరళ నేడు కరోనా ఫ్రీగా మారింది. కానీ.. 151 సీట్లు వచ్చాయన్న జగన్ మాత్రం కరోనా నియంత్రణలో విఫలమయ్యారు. రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, చేతివృత్తుల వారికి అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన రూ.1000కి ఎంతో కొంత కలిపి ఇస్తే.. ఇక్కడ మాత్రం కేంద్రం ఇచ్చిన సొమ్మును తమ జేబుల్లోంచి ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకున్నారు. పేదలకు రూ.5000 చొప్పున సాయం చేయాలని చెప్పినా జగన్ మనసొప్పలేదు'' అని అన్నారు. 

''ప్రజా సంక్షేమం కంటే.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ స్కాములతో వేల కోట్ల ప్రజాధనాన్ని వెనకేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయి. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, ప్రొ.ప్రేమానందం, మాజీ ఎంపీ హర్షకుమార్ విషయంలో ప్రభుత్వ వైఖరి అత్యంత హేయం. డాక్టర్ అనితారాణి ఎస్పీకి ఫిర్యాదు చేసి రెండు నెలలైనా చర్యలు లేవు. హైకోర్టుకు వెళ్లడం, మీడియా ప్రశ్నించడంతో సీఐడీ విచారణ అన్నారు. దీనిపై సీఐడీ విచారణపై నమ్మకం లేదన్నా పట్టించుకోవడం లేదు. నాడు సుధాకర్ మాస్కులు అడిగినందుకు మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. ఇప్పుడు వైసీపీ నేతల నీచ ప్రవృత్తిని ఎండగట్టినందుకు ఆమె మానసిక స్థితి బాగాలేదని, పిచ్చిదని ముద్ర వేస్తున్నారు'' అని తెలిపారు. 

''సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పెళ్లి కానుకలు, పండగ కానుకలు కూడా రద్దు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. సాగునీటి ప్రాజెక్టుల్లో తట్ట మట్టి వేయలేదు. మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయి.? మూడు ముక్కలాటతో అమరావతిని చంపేశారు. కర్నూలు అన్నారు.. కరోనాకు బలి చేశారు. విశాఖను విష వాయువులతో బలితీసుకున్నారు. ఇలా ఏడాది పాలనలో రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశారు'' అని మండిపడ్డారు. 

''పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు బడ్జెట్ సమావేశాలను సద్వినియోగం చేసుకుంటాం. సభా వేధికగా ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయడంపై స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. కరోనాను అడ్డం పెట్టుకుని బడ్జెట్ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తామంటే ఊరుకునేది లేదు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్సిందే. అలా కాకుండా నిరంకుశంగా వ్యవహరిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు'' అని హెచ్చరించారు. 

read more  ప్రజలకు మరోసారి విద్యుత్ షాక్...సిద్దమైన జగన్ సర్కార్: సిపిఐ రామకృష్ణ

''శాసన సభ, మండలి నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పారాసిటమాల్, బ్లీచింగ్ తో పోతుందన్న విధంగా అసెంబ్లీని కూడా బ్లీచింగ్ తో నింపితే సరిపోదు. సభ నిర్వహణకు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటో ప్రజలకు వివరించాలి'' అని నిమ్మల  డిమాండ్ చేశారు.  

''విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో నిద్రలోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రే స్వయంగా లాబీయింగ్ చేసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కుటుంబ సభ్యులను కోల్పోయి ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టారు. బాధితులకు అండగా నిలిచిన వారిపై కేసులు పెట్టారు'' అని  ఆరోపించారు.

''ఇళ్ల స్థలాల ముసుగులో వైసీపీ భూ కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. 600 ఎకరాల ఆవ భూముల్లో రూ.400 కోట్ల భూస్కాం, విశాఖలో భూ ఆక్రమణలు, బిల్డ్ ఏపీ పేరుతో విలువైన భూముల్ని తన అనుయాయులకు కట్టబెట్టడం వంటి అంశాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. పాదయాత్రలో విద్యుత్ బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు సార్లు బిల్లులు పెంచడం, పాత స్లాబ్ విధానం కొనసాగింపు కోసం పోరాడుతాం. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, సిమెంట్, మద్యం ధరలు పెంచి ప్రజలపై రూ.50వేల కోట్ల భారం వేశారు'' అని  ఆరోపించారు.

''సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. నదుల అనుసంధానాన్ని నీరుగార్చారు. వ్యవసాయంలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతాంగం కుదేలైంది. ఆక్వా రంగం పూర్తిగా కుదేలైంది. టీడీపీ హయాంలో నరేగాలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పంటకుంటలు నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచాం. కానీ నేడు బిల్లులు కూడా చెల్లించకుండా నరేగాను నీరుగారుస్తున్నారు'' అన్నారు. 

''కేంద్రం ఆదేశాలను, కోర్టుల ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు. గత ప్రభుత్వ పనితీరుపై విజిలెన్స్ క్లియరెన్స్ ఇచ్చినా ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పుడు రిపోర్టులివ్వాల్సిందిగా శాసిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. గత బకాయిలను కేంద్రం చెల్లించింది. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చింది. ఏడాదిలో రూ.87వేల కోట్లు అప్పు చేశారు. ఇన్ని నిధులతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు.?'' అని రామానాయుడు ప్రశ్నించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios