ప్రభుత్వంతో ఉద్యోగ సంఘం నేతలు  సామరస్యంగా ఉండాల్సిందే. అలా అని సాగిలపడాల్సిన అవసరం లేదు. ఇపుడు అశోక్ చేస్తున్నదదే. అశోక్ బాబు వైఖరి నచ్చకే ఉద్యోగులు ఇటీవలే ఆయనపై తిరుగుబాటు కూడా చేసారు.

‘జీవితకాలం చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి’ ఇది అశోక్ బాబు చెప్పిన మాటలు. రాష్ట్ర విభజన తర్వాత అశోక్ బాబుకు చంద్రబాబు భజనలో తరిస్తున్నాడు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నేత ఆ పని వదిలేసి సిఎంకు భజనపరుడిగా మారిపోయారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘం నేతలు సామరస్యంగా ఉండాల్సిందే. అలా అని సాగిలపడాల్సిన అవసరం లేదు. ఇపుడు అశోక్ చేస్తున్నదదే. అశోక్ బాబు వైఖరి నచ్చకే ఉద్యోగులు ఇటీవలే ఆయనపై తిరుగుబాటు కూడా చేసారు.

నవనిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కాకినాడలో ముఖ్యమంత్రి తదితరులతో ఏపి ఎన్జీవో సంఘం నేత అశోక్ కూడా దీక్షలో పాల్గొన్నారు. ఏపి ఎన్జీవో నేత మాట్లాడుతూ, చంద్రబాబు లాంటి దార్శికత ఉన్న నేత రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే చంద్రబాబు జీవితకాలం సిఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. పైగా పోయిన ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపికి 30 సీట్లు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ టిడిపినే గెలిపించాలని పిలుపునివ్వటం వివాదాస్పదమైంది.

ఏపి ఎన్జీవో నేతగా ఉంటూ ఒక వ్యక్తిని జీవితకాలం సిఎంగా ఉండాలని చెప్పటాన్ని పలువురు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తరపున ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా మాట్లాడటం సబబుకాదంటున్నారు. ఉద్యోగలకు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయినా అశోక్ పట్టించుకోవటం లేదంటూ పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.

సరే, ఇంతమంది ఉద్యోగులను దూరం చేసుకుని అశోక్ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఊరకే మాట్లాడుతున్నారా? ఆలోచించాల్సిందే? టిడిపి తరపున ఎంఎల్సీ పదవిని గతంలోనే ఆశించినా సాధ్యం కాలేదని ప్రచారం జరిగింది. అయితే, ఈసారి మాత్రం ఎంఎల్సీ వస్తుందని ఖాయంగా అనుకుంటున్న కారణంగానే అశోక్ చంద్రబాబు భజన చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.