ఓట్ల గల్లంతుపై వైసీపీ ధ్వజం గుంటూరు కార్పొరేషన్లో ఓటర్ల తొలగింపు ఆరోపణలు ఆరపణలను ఖండిస్తున్న టిడిపి నేతలు
ఓట్ల రచ్చ మొదలైంది. ఓటర్ల జాబితాలో ఓట్లు గల్లంతవుతున్నట్లు ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో జరుగుతాయని అనుకుంటున్న 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది.
అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైరి పార్టీలకు చెందిన ఓట్లు అని గుర్తించిన వారి ఓట్లను జాబితా నుండి తొలగిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు నిరదర్శనంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నిలుస్తోంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తమ పార్టీకి చెందిన ఓట్లను అధికార పార్టీ తొలగిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరొపిస్తున్నారు. దాంతో ఓట్ల రచ్చ మొదలైంది.
తమ వాదనకు వైసీపీ నేతలు ఉదాహరణలు కూడా చూపుతుండటంతో సమస్య మరింత పెరుగుతోంది. 2014లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇపుడు ఓటర్ల సంఖ్య తగ్గిపోయినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. పోయిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2.30 లక్షలున్న ఓటర్ల సంఖ్య తాజాగా 1.65 లక్షలకు తగ్గిపోయినట్లు నేతలు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా, తూర్పు నియోజకవర్గంలో కూడా ఓట్ల సంఖ్య 1.95 లక్షల నుండి 1.46 లక్షలకు తగ్గిపోవటాన్ని వైసీపీ చూపుతోంది. ఓటర్ల సంఖ్యను తగ్గించటం ద్వారా అక్రమ పద్దతిలో, అడ్డదారుల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు టిడిపి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వైసీపీ ధ్వజమెత్తుతోంది.
అయితే, ఓట్ల సంఖ్య తగ్గటంపై టిడిపి నేతలు మాట్లాడుతూ, ఇంటి నెంబర్ల తేడాతో ఓట్ల సంఖ్యలో వ్యత్యాసం వచ్చిందంటున్నారు. ఎవరి ఓట్లనూ తగ్గించాల్సిన అవసరం తమకు లేదని కూడా వారంటున్నారు. కాకపోతే, ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని వివాదాలు రేగుతాయో చూడాలి
