ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆశించినట్లుగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపటానికి రంగం సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది. అభివృద్ధికి ఆటంకం లేకుండా, ఖర్చును తగ్గించటం తదితరాల కోసం పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపాలన్నది మోడి ఆలోచన అన్న సంగతి అందరికీ తెలిసిందే. మోడి అలా తన ఆలోచనను చెప్పారో లేదో వెంటనే చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా స్పందించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా ముందస్తు ఎన్నికలు రావచ్చని చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలతో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

ఇంతకీ ప్రస్తుత విషయానికి వస్తే, వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా సరే పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరపటానికి రెడీగా ఉన్నామంటూ ఎన్నికల కమీషన్ గురువారం ప్రకటించింది. భోపాల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ, ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల వందలాది కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఎన్నికల సంఘానికి ఏం కావాలో కేంద్రప్రభుత్వానికి తెలిపారట. అంటే కావాల్సిన ఈవీఎంలు, నిధుల తదితరాలన్నమాట.

ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సుమారు 40 లక్షల ఈవీఎంలు అవసరమట. వీవీపాట్ల కోసం రూ. 3400 కోట్లు, ఈవీఎంల కోసం రూ. 12 వేల కోట్లు అవసరమని రావత్ చెప్పారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం కేంద్రం నిధులు కూడా మంజూరు చేసేసిందట. పరికారాలన్నీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయట.

చూడబోతే కేంద్రం ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. మామూలుగా అయితే ఎక్కడైనా నిధుల వద్దే  సమస్యలు మొదలవుతాయి. అటువంటిది ఎన్నికల సంఘం అడగ్గానే రూ. 15,400 కోట్లు విడుదల చేసేసిందంటేనే మోడి పట్టుదల అర్ధమవుతోంది. అంటే ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదన్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే చంద్రబాబునాయుడు నేతలను ఏదో ఓ కార్యక్రమం పేరుతో జనాల మధ్యలోకి పరుగులు పెట్టిస్తున్నారు.