విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో మంగళవారం నాడు స్వల్పంగా భూమి కంపించింది.

మంగళవారం నాడు మధ్యాహ్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. దీనికి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మేళ్లచెర్వు, చింతలపాలెం గ్రామాల్లో కూడ భూమి కంపించినట్టుగా స్థానికులు తెలిపారు. 

Also read:ఒంగోలు సహా దేశంలోని పలు చోట్ల భూకంపం: భయంతో ప్రజల పరుగులు

భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.ఈ నెల 5వ తేదీన ప్రకాశం జిల్లాలోని ఓంగోలులో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది.

దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. నగరంలోని శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.18 రోజుల వ్యవధిలో ఏపీలో రెండోసారి భూకంపం వాటిల్లడం ప్రాధాన్యత సంతరించుకొంది.