విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. అందరూ అనుమానిస్తున్నట్లుగానే ముఖ్యమంత్రి, మంత్రులతో సహా పలువురు ఉన్నతాధికారులు చేస్తున్న విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏమాత్రం లాభం ఉండటం లేదు. పలు అధ్యయనాల పేరుతో సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పలువురు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే వీరి విదేశీ పర్యటనవల్ల రాష్ట్రానికి జరుగుతున్న ఉపయోగాలపైనే అందరికీ అనుమానాలున్నాయి.

నిబంధనల ప్రకారం సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు విదేశాల్లో పర్యటించినా తిరిగి వచ్చిన వారంలోగా నివేదికలు అందచేయాలి. అయితే, చంద్రబాబుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు తమ ఇష్టారాజ్యంగా విదేశాల్లో తిరుగి వస్తున్నారే కానీ  నివేదికలు మాత్రం ఇవ్వటం లేదు. దాంతో వాళ్ళ పర్యటనల ఉద్దేశ్యాలనే అనుమానించాల్సి వస్తోంది.

2015 ఏప్రిల్-2017 నవంబర్ మధ్య ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లే కాకుండా రాష్ట్రస్ధాయి అధికారులు మొత్త 204 మంది 481 సార్లు విదేశీ ప్రయాణాలు చేసారు. ఎవరు విదేశాల్లో పర్యటించిన తమ పర్యటన ఉద్దేశ్యాలను ఓ నివేదిక రూపంలో తిరిగి వచ్చిన వారంలోగా అందచేయాలి. అయితే, 204 సాధారణ పరిపాలనా శాఖకు నివేదికలు అందచేసిన వారు కేవలం 41 మంది మాత్రమే. అంటే మిగిలిన వారు ఎందుకు అందచేయలేదు? ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల తాలూకు నివేదికలు కూడా అందటం లేదు. విదేశీ పర్యటనలకు వెళ్ళిన వారిలో పలువురు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళినట్లు ఆరోపణలున్నా వారిపై చర్యలు మాత్రం లేవు.

ఐఏఎస్ అధికారుల్లో అజయ్ జైన్ అత్యధికంగా 15 పర్యటనల్లో 80 రోజులు విదేశాల్లో పర్యటించారు. కానీ నివేదికలు మాత్రం మూడే ఇచ్చారు. చంద్రబాబు 13 విదేశీ పర్యటనల్లో 57 రోజుల్లో విదేశాల్లో ఉన్నారు.  ఎన్ని పర్యటనలపై నివేదికలు ఇచ్చారో స్పష్టత లేదు. సిఎంతో పాటు వెళ్ళిన అధికారులే నివేదికలు ఇవ్వాలి. విచిత్రమేంటంటే సిఎంతో పాటు విదేశీ పర్యటనల్లో పాల్గొంటున్న ఏ ఐఏఎస్ అధికారి కూడా ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదట.

నివేదికలు ఇవని అధికారుల్లో ఆదిత్యనాధ్ దాస్, రావత్, మన్మోహన్ సింగ్, పివి రమేష్ తదితరులున్నారు. ఐపిఎస్ అధికారుల్లో అనూరాధ, కె. సత్యనారాయణ, విశాల్ గున్ని మాత్రమే నివేదికలు అందచేశారట. చివరకు, నిబంధనలు గురించి మాట్లాడుతున్న మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఎస్పీ ఠక్కర్, మాజీ డిజిపి జెవి రాముడు, ప్రస్తుత డిజిపి సాంబశివరావు కూడా నివేదికలు ఇవ్వలేదట.