అమరావతి: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయి కూతురిని కోల్పోయిన తల్లిదండ్రులు న్యాయం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. హోమంత్రి మేకతోటి సుచరిత చొరవతో దివ్య తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలవనున్నారు. తమ కడుపుకోతకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్ ను కోరనున్నారు. 

మృతురాలు దివ్య తేజస్వి తల్లిదండ్రులు హోంమంత్రి సుచరితతో కలిసి మద్యాహ్నం 3 గంటలకు సీఎంని కలవనున్నారు. సీఎంని కలిసి తమ ఆవేదనను తెలియజేసే అవకాశం కల్పించాలని రెండు రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రిని దివ్య కుటుంబసభ్యులు అభ్యర్ధించారు. వారి విజ్ఞప్తితో  సీఎం జగన్ ను కలిసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపారు హోంమంత్రి. ఇందుకోసం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

read more  దివ్య తేజస్విని హత్య కేసు : అతనివన్నీ డ్రామాలే... అసలేం జరిగిందంటే...

యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమని, ఇటువంటి ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్‌ ఉన్న ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని అతి కిరాతంగా దాడి చేసి చంపడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హోంమంత్రి హెచ్చరించారు. 

ప్రేమను నిరాకరించిందని తేజస్విని అనే యువతిని నాగేంద్రబాబు అనే వ్యక్తి కత్తితో పొడిచి...తర్వాత తనను తాను గాయపరుచుకోవడం ఉన్మాద చర్య అని మండిపడ్డారు. తల్లిదండ్రులెవరూ లేని సమయంలో నేరుగా తేజస్విని ఇంటికెళ్లి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిందన్నారు. మహిళల భద్రత కోసం  ఎన్నో కఠిన చట్టాలు తీసుకువచ్చినా...ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని హోంమంత్రి సుచరిత విచారం వ్యక్తం చేశారు.

ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. చిన్నారులపై, మహిళలపై జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం సహించదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్మాదకరమైన ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని,  చట్టాలను కఠినతరం  చేసే చర్యల్లో భాగంగానే దిశ బిల్లును  రూపొందించినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు.

విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్ధిని తేజస్విని ఇంటికి వెళ్లి స్వామి అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోశాడు.  ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు. ఇలా ఇన్నాళ్లు ప్రేమపేరిట వేధించి తాజాగా యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు ఈ సైకో.