తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గాన్ని ఎంచుకునే భక్తులకు టీటీడీ (TTD) కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు శ్రీవారి మెట్టు వద్ద అందించిన దివ్య దర్శనం టోకెన్లు ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మార్పు శుక్రవారం సాయంత్రం నుంచే అమల్లోకి వచ్చింది.
భూదేవి కాంప్లెక్స్‌లో..
భూదేవి కాంప్లెక్స్‌లో నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో మౌలిక సదుపాయాలున్న ఈ కాంప్లెక్స్‌ను ఎంపిక చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీనివాస మంగాపురం ఆలయంలో టోకెన్ల కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రణాళికపై పురావస్తు శాఖ అనుమతి ఇంకా రావాల్సి ఉండటంతో, తాత్కాలికంగా ఈ మార్పు చేపట్టారు.
ఎస్ఎస్‌డీ టోకెన్లు..
ఈ మార్పుపై మాట్లాడిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, భక్తులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇప్పటికే ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అక్కడే దివ్య దర్శన టోకెన్లు కూడా ఇవ్వడం సౌకర్యంగా మారిందన్నారు.
14 కౌంటర్లను..
శుక్రవారం ఆలయ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భూదేవి కాంప్లెక్స్‌లో 14 కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు అందించారు. ఇందులో 5 కౌంటర్లు దివ్య దర్శనం కోసం ప్రత్యేకంగా కేటాయించారు. మిగతా కౌంటర్ల ద్వారా సాధారణ దర్శనం టోకెన్లు ఇచ్చారు.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ తాగునీరు, ఉచిత బస్సు సేవలు అందిస్తోంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని క్యూలైన్ల వద్ద షెడ్ల ఏర్పాట్లు చేశారు. టోకెన్లు పొందిన వారు శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద స్కానింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
