తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని విగ్రహాలపై చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శ్రీవారిపై భక్తి, విశ్వాసం ఉన్నాయని ఆయన మీడియాతో చెప్పారు. జగన్ ప్రజలనే దేవుళ్లుగా భావిస్తారని చెప్పారు. జగన్ కు కుల, మత పట్టింపులు లేవని అన్నారు. 

Also Read: క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి... : కొడాలి నానికి రఘురామ వార్నింగ్

శ్రీవారిపై నమ్మకం ఉంది కాబట్టే వైఎస్ జగన్ కాలినడక వచ్చారని ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన గుర్తు చేశారు. డిక్లరేషన్ అంశం ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. 

జగన్ అన్యమతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలనే డిమాండ్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. దానిపై నారాయణ స్వామి స్పందించారు. కనకదుర్గ గుడిలోని రథంపై వెండి సింహాల ప్రతిమలు చోరీకి గురైతే దేవుడికి వచ్చిన ఇబ్బందేమీ లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.

Also Read: కొడాలి నాని వ్యాఖ్యలు:విపక్షాల కౌంటర్, హీటెక్కిన రాజకీయాలు