అమరావతి: తిరుమలలో డిక్లరేషన్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ విషయమై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. సీఎం జగన్ డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదని పలువురు మంత్రులు, వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. ఇదే విఫయంలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. 

తిరుమలలో డిక్లరేషన్ విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ విషయంలో మంత్రి నాని తీరును తప్పుబడుతున్నారు.

విపక్షాలు చేసే విమర్శలను మంత్రి కొడాలి నాని తిప్పికొట్టడంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై ఆయన ఒంటికాలిపై లేస్తారు.తిరుమలలో డిక్లరేషన్ ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ గుడి, మసీదు, చర్చిలో లేని సంప్రదాయం తిరుమలలోనే ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు.

తాను మసీదులు, గుళ్లు, చర్చిలకు వెళ్తానని తనను ఎవరూ కూడ ఏ మతమని అడగలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

also read:తిరుమలలో డిక్లరేషన్‌: మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అంతర్వేది, కనకదుర్గమ్మ గుడిలొ రథంపై సింహాల ప్రతిమలు మాయం కావడంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది.  వెండి రథం, సింహాల ప్రతిమలు చోరీకి గురైతే దేవుడికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీజేపీ మంత్రిని డిమాండ్ చేసింది. తిరుమలలో డిక్లరేషన్ విషయంలో టీటీడీ ఛైర్మెన్ వైవీసుబ్బారెడ్డి వ్యాఖ్యలను  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానిలు సమర్ధించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పవాడా అని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

 

అంతర్వేదిలో రథం దగ్దం కావడం, విజయవాడలో కనకదుర్గఅమ్మవారి రథంపై వెండి సింహాలు చోరీకి గురికావడంతో పాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వరుసగా చోటు చేసుకొన్న ఘటనలు రాజకీయ వేడిని రగిల్చాయి.

టీడీపీ, బీజేపీ, జనసేనలు వైసీపీపై దాడిని తీవ్రం చేశాయి. విపక్షాల దాడిని కౌంటర్ చేసేందుకు  కొందరు వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి.