వైసీపీలో చేరుతున్న వారికైనా, టిడిపి చేర్చుకోవాలని అనుకుంటున్నా ఆయా పార్టీల్లో ఇప్పటికే చేరిన కాంగ్రెస్ నేతల ద్వారానే గాలమేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం కోసం ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షం గాలమేస్తున్నాయి. జిల్లాల వారీగా చురుకుగా ఉన్న కాంగ్రెస్ నాయకులను గుర్తించటంలో రెండు పార్టీలూ నిమగ్నమైనట్లు సమాచారం.
పోయిన ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారెవరు, అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న వారెవరన్న వివరాలను టిడిపి నాయకత్వం జాబితా రూపంలో సిద్ధం చేసింది.
అసలు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని నిర్వీర్యం చేసేందుకే టిడిపి భారీ ప్లాన్ వేసింది. అయితే అనుకున్నది అనుకున్నట్లు సాగలేదు. దాంతో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గాలమేసి 22 మంది ఎంఎల్ఏలను లాక్కుంది.
అయితే, వివిధ కారణాల వల్ల వారిలో అత్యధికులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయటం లేదు. పార్టీ నేతలు కూడా వారిని పరాయివారిగానే చూస్తున్నారు. దాంతో పాత, కొత్త తమ్ముళ్ల మధ్య నిత్యమూ ఆయా నియోజకవర్గాల్లో ఘర్షణలే.
దానికితోడు వైసీపీ నుండి టిడిపిలోకి కొత్తగా వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం అధికార పార్టీలో చేరటానికి పెద్దగా ఆశక్తి చూపటం లేదు. ఈ పరిస్ధితిలో దేశం తరపున బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీలో నుండి టిడిపిలోకి వెళతారనుకున్న యువనేతలను వైసీపీ ఆకర్షస్తోంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. మహేష్ టిడిపిలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే చివరినిముషంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవటంతో దేశం నేతలు ఖంగుతిన్నారు.
అదే రీతిలో పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్ కూడా త్వరలో వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వివిధ జిల్లాలోని కాంగ్రెస్ యువనేతలు, పోయిన ఎన్నికల తర్వాత తటస్ధంగా ఉన్న పలువురు యువనేతలు కూడా వైసీపీలో చేరటానికే ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం.
వైసీపీలో చేరుతున్న వారికైనా, టిడిపి చేర్చుకోవాలని అనుకుంటున్నా ఆయా పార్టీల్లో ఇప్పటికే చేరిన కాంగ్రెస్ నేతల ద్వారానే గాలమేస్తున్నాయి. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షం ఒకేసారి యువనేతలను ఆకర్షించేందుకు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ నాయకత్వంతో పాటు యువనేతలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతోంది.
