Asianet News TeluguAsianet News Telugu

Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం... విశాఖకు 516కి.మీ దూరంలో కేంద్రీకృతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారగా తాజాగా ఇదికాస్త మరింత బలపడి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాను శనివారం విశాఖ-ఒడిషా సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

Deep depression intensifies into Cyclone Jawed
Author
Visakhapatnam, First Published Dec 3, 2021, 2:08 PM IST

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అంతకంతకు మరింత బలపడుతూ  మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.   ఈ తుపానుకు జవాద్ గా నామకరణం చేసారు. 

ప్రస్తుతం cyclone jawad ఉత్తరాంధ్రలోని విశాఖకు ఆగ్నేయంగా దాదాపు 516  కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు స్ఫష్టం చేశారు. ప్రస్తుతం ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో తీరంవైపుగా కదులుతున్నట్టు IMD వెల్లడించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే శనివారం(రేపు) ఉదయానికి ఇది ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా పరిసరాల్లో తీరాన్ని దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. 

ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా చిరుజల్లులు కూడా ప్రారంభమయ్యాయి. తుపాను తీరానికి దగ్గరయ్యేకొద్ది వర్షతీవ్రత పెరుగుతుందని... ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

read more  Cyclone Jawad: ఉత్తరాంధ్రకు పొంచివున్న తుఫాను ముప్పు... 100కి.మీ వేగంతో గాలులు, ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు

జవాద్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని...ఇది కేంద్రీకృతమైన చోట అలలు ఎగసి పడుతున్నట్టు  ఇన్ కాయిస్ సంస్థ తెలియచేసింది. ఈ ప్రాంతంలో అలల ఎత్తు 3.5 మీటర్లుగా ఉందని వెల్లడించింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలియచేసింది.

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇప్పటికే అప్రమత్తమై ప్రమాదం పొంచివున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలోపడ్డారు. 

 ఇక ఉభయగోదావరి జిల్లాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్‌ కేంద్ర కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నారు. రక్షణ, సహాయశాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

read more  తుఫానుగా బలపడుతోన్న అల్పపీడనం... ఉత్తరాంధ్రకు పొంచి వున్న ముప్పు, శనివారం ఉగ్రరూపమే

జవాద్‌ తుపాను దృష్ట్యా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు.

తుపాను ప్రభావంతో శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు. ఇవాళ ప్రారంభమయ్యే హౌరా-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12703), సికింద్రాబాద్‌-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12704), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17016), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17015) రైళ్లను నిలిపివేసినట్లు తెలిపారు.

ఇవాళ సాయంత్రం నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు తీరంవెంబడి గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదంతో పాటు వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios