Cyclone Jawad: ఉత్తరాంధ్రకు పొంచివున్న తుఫాను ముప్పు... 100కి.మీ వేగంతో గాలులు, ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు
జవాద్ తుఫాను శనివారం తీరం దాటనుండగా ఇవాళ్టి నుండే ఈదురుగాలులతో కూడిన భాారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
విశాఖపట్నం: ఇప్పటికే భారీ వర్షాలతో సతమతం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మరో తుఫాను భయం పట్టుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారి విశాఖ దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై వుంది. ఇది మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ వాయుగుండం కాస్త తుఫాన్ గా మారనుంది. ఈ తుఫానుకు జవాద్ గా నామకరణం చేసారు.
ప్రస్తుతం విశాఖ తీరానికి 960కిలోమీటర్లు దూరంలో, ఒడిషాలోని గోపాలపూర్ కు 1020, పరదీప్ కు 1080 కిలోమీటర్లు దూరంలో ఈ వాయుగుండం కేందీకృతమైవుంది. రేపు(శనివారం) ఉదయానికి ఉత్తర కోస్తా -ఒడిశా తీరాలకు సమీపించునున్న తుపాను తీరం తాకే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది.
ఈ cyclone jawad ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాతో పాటు యానాంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
read more తుఫానుగా బలపడుతోన్న అల్పపీడనం... ఉత్తరాంధ్రకు పొంచి వున్న ముప్పు, శనివారం ఉగ్రరూపమే
ఇవాళ సాయంత్రం నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు తీరంవెంబడి గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదంతో పాటు వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే ఈ రెండురోజులు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే అవకాశమున్న విశాఖ జిల్లాకు ఇప్పటికే 50 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. అలాగే నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇవాళ, రేపు విశాఖపట్నంలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేసారు. శుక్ర, శనివారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఎలాంటి అవసరమున్నా కలెక్టరేట్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సూచించారు.
read more కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇప్పటికే అప్రమత్తమై ప్రమాదం పొంచివున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలోపడ్డారు.
ఇక ఉభయగోదావరి జిల్లాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్ కేంద్ర కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నారు. రక్షణ, సహాయశాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
జవాద్ తుపాను దృష్ట్యా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రభావంతో శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్లు డివిజనల్ రైల్వే అధికారి తెలిపారు. ఇవాళ ప్రారంభమయ్యే హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12703), సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12704), సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్(17016), భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్(17015) రైళ్లను నిలిపివేసినట్లు తెలిపారు.