Cyber Fraud:గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో పడి క్షణాల్లో రూ. 1.36 లక్షలు మోసపోయారు. ఈ ఘటన సైబర్ నేరాల ప్రమాదాన్ని మరింత గుర్తుచేస్తోంది.

Cyber Fraud: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రతి రోజూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో, ప్రతి ఒక్కరికీ ఈ మోసాల బారిన పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంక్ పిన్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల నేరాలకు బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ట్రాఫిక్ చలానా భయంతో సైబ‌ర్‌ నేరగాళ్ల వలలో పడ్డారు. క్షణాల్లో రూ. 1.36ల‌క్ష‌లు మోసపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, వీర్లపాలే ప్రాంతంలో సైబర్ మోసం ఘటనా చోటుచేసుకుంది. స్థానికంగా హోటల్ నడుపుకుంటున్న నిరంజన్ రెడ్డి మొబైల్ ఫోన్‌కు శుక్రవారం రాత్రి "ట్రాఫిక్ చలానా" పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌లో రాష్ట్ర పోలీసుల పేరుతో తన వాహనంపై చలానా విధించబడిందని, వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయమని సూచన ఉన్నది.

దీంతో నిరంజన్ రెడ్డి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. ఆ యాప్ ఓపెన్ చేయగానే ఓటీపీ అడిగింది. ఆ సమయంలో అతనికి అనుమానం రావడంతో వెంటనే ఆ యాప్ ను క్లోజ్ చేశాడు. కానీ, శనివారం ఉదయం క్రెడిట్ కార్డు నుంచి అనుకోకుండా డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ లు వచ్చాయి. ఒకసారి రూ.61,000, మరొకసారి రూ.32,000 కట్ అయ్యాయి. అప్ర‌మత్తంగా నిరంజన్ కార్డును బ్లాక్ చేయించారు. అయినప్పటికీ మరోసారి రూ.20,999 కూడా మోసగాళ్లు తీసుకెళ్లారు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.1.36 లక్షల వరకు డబ్బులు దోచుకున్నారు.

ఈ డబ్బుతో ఆన్‌లైన్‌లో మొబైళ్లను కొనుగోలు చేసినట్లు అతనికి మెసేజ్ లు వచ్చాయి. అప్పటికే సైబర్ క్రైమ్ పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించి, మోసానికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించారు. విచారణలో అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని గుర్తించబడింది. ప్రస్తుతంలో కేసు దర్యాప్తు కొనసాగుతున్నది, ఇంకా మోసగాళ్లను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మోసం జరిగిందని గుర్తిస్తే.. వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

సైబర్ నేరాల నివారణకు సూచనలు:

ప్రజలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ భద్రతపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పిన్‌లు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లను తెరవకుండా, వాటిని కనిపెట్టిన వెంటనే పోలీసులు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు సమాచారం ఇవ్వాలి. 

అలాగే, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం, అప్రమత్తంగా ఉండడం, సైబర్ నేరానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయడం చాలా అవసరం. ప్రజలు సైబర్ నేరాల పరిస్థితులను తెలుసుకుని, జాగ్రత్తగా ఉంటే ఈ నేరాలను అరికట్టవచ్చు.