ఓ స్కూల్లో ఎలక్ట్రీషియన్ పనులు చేయడానికి వచ్చిన వ్యక్తి సరదా కోసం విద్యార్థినులు కూర్చున్న బెంచికి కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 

కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. కంకిపాడు మండలం ఇడుపుగల్లు జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కరెంట్ షాక్ ఇచ్చాడు ఓ ఎలక్ట్రీషియన్. స్కూల్లో విద్యుత్ పనులు చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రిషన్ ముగ్గురు విద్యార్థునిలకు కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో ముగ్గురు విద్యార్థినిలు అస్వస్థత పాలయ్యారు. ఓ విద్యార్థిని స్పృహ కోల్పోయింది.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… స్కూల్లో క్లాస్ రూంలో టీవీలు పెట్టడం కోసం.. ఓ ఎలక్ట్రిషన్ ను హెడ్మాస్టర్ పద్మావతి భాయ్ పిలిపించారు. ఆ ఎలక్ట్రీషియన్ తనతో పాటు సహాయం కోసం సూరిబాబు అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చుకున్నాడు. టీవీలకు కరెంట్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో భాగంగా గురువారం నాడు టెన్త్ క్లాస్ బి సెక్షన్ లో సూరిబాబు విద్యుత్ పనులు చేస్తున్నాడు.

పాశవికం.. ఏడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసి, నాలుక కోసి, కళ్లు,పళ్లు పీకి....

 ఆ సమయంలో క్లాసులోని విద్యార్థినులతో మాటలు కలిపాడు. అలా మాటలు కలుపుతూ కరెంటు వైర్లను.. ఆ విద్యార్థులను కూర్చున్న బెంచ్ కి తాకించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తో వారు ఉలిక్కిపడ్డారు. అది చూసిన సూరిబాబు… పలుమార్లు ఇలాగే చేశాడు. ఆ తర్వాత షాక్ వచ్చిన ముగ్గురు విద్యార్థినులు బాగా అలసిపోయి ముఖం కడుక్కోవడానికి బయటకి వచ్చారు.

ఈ క్రమంలో ఓ విద్యార్థిని నీరసంతో పడిపోయింది. దీంతో విషయం ప్రధానోపాధ్యాయినికి తెలిసింది. వెంటనే స్కూల్ సిబ్బంది సమీపంలోని ఆర్ఎంపీని పిలిపించి అవి విద్యార్థినికి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత వారిని ఇళ్లకు పంపించేశారు. అప్పటికి ఇంకా కరెంట్ షాక్ విషయం ఎవరికీ తెలియదు.ఇంటికి వెళ్ళిన విద్యార్థినులు సాయంత్రానికి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు.

వెంటనే వారు ఈ విషయాన్ని మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం మండలాధికారులు, ప్రజాప్రతినిధులు స్కూలుకు వచ్చారు. హెడ్మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హెడ్మాస్టర్ తనకి ఈ విషయం తెలియదంటూ ఆ ఎలక్ట్రిషన్ను, అతనితో పాటు వచ్చిన సూరిబాబును పాఠశాలకు పిలిపించారు. వారిద్దరినీ నిలదీయగా సూరిబాబు తాను సరదా కోసమే ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…కేసు నమోదు చేసుకున్నారు.