Asianet News TeluguAsianet News Telugu

నేరాంధ్రప్రదేశ్ గా మారుతోందా?

  • కేవలం గడిచిన నాలుగు నెలల్లో 5,673 మంది మహిళలు వివిధ ఘటనల్లో బాధితులయ్యారు
  • ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో  ప్రభుత్వం ఎంతమందికి శిక్షలు విధించింది.?
  • ఎంత మంది బాధితులకు న్యాయం జరిగింది?  
Crime rate sees big rise in Andhra Pradesh

‘ మహిళలను బాధపెట్టినా, వేధించినా.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడినా.. అలాంటి వారిని క్షమించేది లేదు. కఠిన శిక్షలు విధిస్తాం’.. ఈ వ్యాఖ్యలు ఎక్కడైనా విన్నట్టు ఉన్నాయా..? అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు మార్లు చెప్పినవే.  మాటలు చూస్తే చాలా గంభీరంగా ఉంటాయి. ఆచరణలోకి వచ్చే సరికి కార్యరూపం దాల్చడం లేదు. అసలు వాస్తవానికి ఏం జరుగుతుందో తెలుసా.. ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోయింది.  మహిళలు అసలు రక్షణే కరువైంది. ఇందుకు సాక్ష్యమే.. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశం. కలెక్టర్లే  స్వయంగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాల జాబితాను సీఎం ముందు పెట్టారు.

 

కేవలం గడిచిన నాలుగు నెలల్లో 5,673 మంది మహిళలు వివిధ ఘటనల్లో బాధితులయ్యారు. ఇదొక్కటి చాలు.. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. మూడు న్నర సంవత్సరాల చంద్రబాబు పాలనలో జరిగింది ఏమిటయ్యా అంటే.. మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు.

Crime rate sees big rise in Andhra Pradesh

ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో  ప్రభుత్వం ఎంతమందికి శిక్షలు విధించింది.? ఎంత మంది బాధితులకు న్యాయం జరిగింది?  కొంత కాలం క్రితం వరకు నేర శాతం చాలా తక్కువగా ఉండే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు అత్యధికంగా నేరశాతం పెరిగిపోతోంది. సీసీటీవీలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నప్పటికీ నేరాలు తగ్గడం లేదు. పైగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు..  పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడుతోంది అధికార పార్టీ నేతలే అనే వాదనలు వినపడుతున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ రూపంలో చాలా మంది మహిళలు నరకాన్ని చవి చూశారు. ఈ కేసులో మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ అసలు నేరస్థులను వదిలిపెట్టి.. ఆ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని వారిని అరెస్టు చేశారు. నిజమైన నేరస్థులు మాత్రం.. దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారు. మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైంది. చేతల విషయానికి వచ్చే సరికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

 

రాజధాని ప్రాంతంలోనే అత్యధికంగా నేరాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు అసలు పనిచేస్తున్నయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మహిళలపై ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కులాల కు చెందిన వారిపై జరుగుతున్న దాడులకు అంతేలేదు.  ఇది ఆంధ్రప్రదేశ్ కాదు.. నేరాంధ్ర ప్రదేశ్ అని పిలిచినా తప్పులేదని పలువురు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios