అమరావతి: సీఆర్డిఎ ఉపసంహరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. దాదాపు 151 మంది ఎమ్మెల్యేలతో సీఆర్డీఎ ఉసంహరణ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసుకోవడం వైఎస్ జగన్ కు అత్యంత సులభమైన విషయం. కానీ శాసన మండలిలో దాన్ని గట్టెక్కించుకునే పరిస్థితి లేదు. 

బిల్లును శాసన మండలిలో అడ్డుకుని పాలన వికేంద్రీకరణ లేదా మూడు రాజధానుల వైఎస్ జగన్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేశారు. ఈ బిల్లును శాసన మండలిలో అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన తాజాగా చెప్పారు. శాసన మండలిలో టీడీపీకి 32 మంది, వైసీపీ 12 మంది సభ్యులున్నారు. దీంతో శాసన మండలిలో బిల్లును అడ్డుకోవడం సులభమని తెలుగుదేశం పార్టీ భావించింది.

Also Read: సీఆర్డీఎ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

టీడీపీ వ్యూహాన్ని వైఎస్ జగన్ తిప్పికొట్టడానికి అవసరమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. సీఆర్డీఎ రద్దు బిల్లును ద్రవ్య బిల్లుగా శాసనసభలో ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ద్రవ్య బిల్లుగా ప్రవేశపెడితే బిల్లు చట్టంగా రూపొందించి అమలు చేయడానికి శాసన మండలి ఆమోదం అవసరం ఉండదు. బహుశా, దానిపై శాసన మండలిలో చర్చకు పెట్టవచ్చు. 

శాసన మండలి ఆ బిల్లును తిరస్కరించినా కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి బిల్లును అమలులోకి తేవడానికి అడ్డంకులుండవు. రైతులకు ఇచ్చే నష్టపరిహారం బిల్లులో ఇమిడి ఉన్నందున దాన్ని ద్రవ్య బిల్లుగా పెట్టడానికి తగిన వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారు.

మూడు రాజధానులు: జగన్ ప్రభుత్వానికి మండలి గండం, వ్యూహం ఇదీ.

అదే సమయంలో అమరావతి రైతులకు రైతులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూములు ఇచ్చిన రైతులకు కౌలును 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పొడగించాలని నిర్ణయించింది. దీంతో రైతులకు గతంలో కన్నా ఎక్కువ చెల్లింపులు జరుగుతాయి. దీనివల్ల రాజధాని రైతుల ఆందోళనను చల్లార్చడానికి వీలవుతుందని భావిస్తున్నారు.