అమరావతి: పరిపాలన వికేంద్రీకరణతో పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసన మండలి గండం పొంచి ఉంది. దీన్ని జగన్ ఎలా అధిగమిస్తారనే ఆసక్తి చోటు చేసుకుంది. అయితే, అందుకు తగిన వ్యూహాన్నే జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

మూడు రాజధానులు, ఓ హైకోర్టు, సిఎం క్యాంప్ కార్యాలయాలు, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు... జీఎన్ రావు కమిటీ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులు అవి. పాలనా వికేంద్రీకరణపై జగన్ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను సమర్పించింది. 

వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుగుణంగా ఆయా వ్యవస్థలను మరిన్ని ముక్కలు చేస్తూ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత రాజధాని మార్పుపై బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ (బీసీజీ) కమిటీని ప్రభుత్వ నియమించింది. బీసీజీ కూడా తన నివేదికను సమర్పించింది. 

ఆ రెండు కమిటీల నివేదికలపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీన అసెంంబ్లీ సమావేశాన్ని, 21వ తేదీన శాసన మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు .గతంలో సీఆర్డీఎ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. 

రాజధాని మార్పునకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనకు శాసన మండలి గండం పొంచి ఉంది. మండలిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నందున శాసనసభలో బిల్లు ఆమోదం పొందడం ఖాయం. కానీ శాసన మండలిలో టీడీపీ దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. 

మండలిలో ఆధిక్యం ఉన్న టీడీపీకి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బిల్లును మరింత నిశితంగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకీ పంపించవచ్చు. ఆ పేరుతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రెండు, మూడు నెలలు సాగదీయవచ్చు. లేదా బిల్లుకు సవరణలు ప్రతిపాదించి అసెంబ్లీకి వెనక్కి పంపించవచ్చు. 

అలా వెనక్కి పంపించినప్పుడు అసెంబ్లీ మరోసారి ఆమోదించి మండలికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవడానికి మండలికి నెల రోజుల గడువు ఉంటుంది. రెండో సారి కూడా మండలి తిరస్కరిస్తే ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయం ఫైనల్ అవుతుంది.

అయితే, జగన్ మరోరకంగా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. సీఆర్డీఎ రద్దు బిల్లును ఆర్థిక బిల్లుగా శాసనసభలో ప్రతిపాదించే అవకాశం ఉంది. అమరావతి రైతులకు నష్టపరిహారం చెల్లించే అంశం ఉంది కాబట్టి మనీబిల్లుగా ప్రవేశపెట్టి జగన్ గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మనీ బిల్లుగా ప్రవేశపెడితే శాసన మండలి ఆమోదం దానికి అవసరం లేకపోవచ్చు. కేవలం దానిపై చర్చ మాత్రమే జరిగే అవకాశం ఉంది. శాసన మండలిలో టీడీపీకి మెజారిటీ ఉందని తెలిసి కూడా జగన్ ముందుకు సాగుతున్నారంటే పక్కా వ్యూహం ఉందని అనుకోవాల్సి ఉంటుంది.