రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు అధికారంలోని పార్టీలకు కల్పతరువుగా ఉపయోగపడుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు-ప్రత్యారోపణలు చూస్తుంటే ఏదో సామోత చెప్పినట్లు అందరూ కలిసి ఊరిని దోచుకున్నట్లు లేదు? రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు అధికారంలోని పార్టీలకు కల్పతరువుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ పార్టీకి కూడా చిత్తశుద్ది లేదన్నది స్పష్టమవుతోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జలయజ్ఞం పేరుతో చేపట్టారు. దాంతో తెలుగుదేశంపార్టీ ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. జలయజ్ఞంలో దోపిడి జరుగుతోందంటూ ఏకంగా ఒ పుస్తకాన్నే ప్రచురించి జాతీయ స్ధాయిలో టిడిపి పంపిణీ చేసింది.

అయితే, హటాత్తుగా వైఎస్ మరణించటంతో ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు బ్రేకులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన జరగటం, ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సిఎం అయ్యారు. వెంటనే అప్పటి వరకూ జరిగిన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై సమీక్షలు జరిపారు. అయితే, సమీక్షలు జరిపిన చంద్రబాబు వాటి నిర్మాణ అంచనాలను పెంచేసారు. తన మనుషులకు ఇచ్చి పనులు చేయించటం మొదలుపెట్టారు.

దాంతో టిడిపి కూడా ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్, వైసీపీ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. అంటే అర్ధం ఏమిటి? వైఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హాయాంలో జరిగిన దోపిడి టిడిపి హయంలో కూడా కొనసాగుతోందనే కదా? అంటే రెండు పార్టీలూ దొందు దొందే అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

ఉదాహరణకు చంద్రబాబు సిఎం కాగానే పోలవరం అంచనా వ్యయం రూ. 16 వేల కోట్ల నుండి ఏకంగా రూ. 40 వేల కోట్లకు ఎందుకు పెరిగింది? అసలు జాతీయ ప్రాజెక్టయిన పోలవరం నిర్మించే బాధ్యతను చంద్రబాబు కేంద్రానికి ఎందుకు అప్పగించ లేదు? ఇక్కడ మ్యాటర్ క్లియర్.

తన చేతుల మీదగానే పోలవరం నిర్మాణమవ్వాలని పట్టుబడుతున్నారంటేనే చంద్రబాబుకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందనే కదా? ఆ ఇంట్రెస్టే ఏమిటి? అంచనాలు పెంచేయటం, తనకు ఇష్టమైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోపిడిని కొనసాగించటమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

పైగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ట్రాన్స్ టాయ్ సంస్ధను తొలగించమని కేంద్రం ఎన్నిమార్లు చెప్పినా చంద్రబాబు తొలగించకపోవటం కూడా కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇంతకీ మనకు అర్ధమవుతున్నదేమిటి? ప్రాజెక్టుల ముసుగులో ప్రజాధనం దోపిడి విచ్చలవిడిగా జరుగుతోందన్నది నిజమేకదా? మరి ఎవరి డబ్బును ఎవరు పంచుకుంటున్నారు?