ప్రస్తుతం భారతదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇదే సమయంలో భారత్ షట్ టౌన్ దిశగా అడుగులు వేస్తోంది.

కరోనా ఆధ్యాత్మిక కేంద్రాలపైనా పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంతో పాటు షిర్డీ సాయి నాధుని దేవాలయాలను ప్రభుత్వం మూసివేసింది. ఈ క్రమంలో పుట్టపర్తిలోని సత్యసాయి ట్రస్ట్ అప్రమత్తమైంది.

Also Read:విదేశీయులను దగ్గరకు రానివ్వని భారతీయులు: స్మశానంలో పడుకున్న ఫ్రెంచ్ వాసి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రశాంతి ఆలయానికి వచ్చే విదేశీ భక్తులకు బుధవారం నుంచి ఎలాంటి వసతి సౌకర్యం ఇవ్వబడదని ప్రకటించింది. దీనితో పాటు నక్షత్రశాల, చైతన్య జ్యోతి మ్యూజియం, సనాతన సంస్కృతి మ్యూజియాలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది.

రెండు వారాలపాటు నిత్య అన్నదానం ఉండదని, కేవలం ఆశ్రమవాసులకు, ఉద్యోగులకు, సేవాదళ్ సభ్యులకు మాత్రమే ప్రశాంతి క్యాంటీన్లలో భోజనం, టిఫిన్ లభిస్తుందని ట్రస్ట్ వెల్లడించింది. బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్ధితి అనుమతి లేదని, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: పూర్తి స్థాయి షట్ డౌన్ దిశగా భారత్, ఎక్కడికక్కడ కట్టడి

ట్రస్ట్ పరిధిలో ఉన్న బెంగళూరు వైట్ ఫీల్డ్ సత్యసాయి ఆశ్రమం బంద్ చేయాలని, తదుపరి ఆదేశాల వరకు ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్ధులకు సెలవు ప్రకటించారు. అలాగే సత్యసాయి సమాధిని దూరం నుంచి దర్శించుకోవాలని సత్యసాయి ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది.