విశాఖపట్నం: కరోనా సోకడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న హాస్పిటల్లోనే అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబలి నరసింహమూర్తి(61) రిటైర్డ్ టీచర్. ఆయన ఇటీవల కరోనా బారిన పడటంతో కుటుంబసభ్యులు వెంకోజిపాలెంలోని ప్రతిమ హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఏమయ్యిందో ఏమోగాని ఆయన మంగళవారం హాస్పిటల్ లో తాను చికిత్స పొందుతున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యను గుర్తించిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందడంతో వారు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. కరోనాపై భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే ఏవయినా కారణాలు వున్నాయా అన్నది తెలియాల్సి వుంది. 

read more  కోవిడియట్స్... డ్యాన్సులతో కరోనాకి ఆహ్వానమా..: వైసిపి ఎమ్మెల్యేపై లోకేష్ సీరియస్

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,846 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది.

నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,041కి చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 92,353 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 9,628 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,86,531కి చేరింది. నిన్న ఒక్క రోజే అనంతపురం 299, చిత్తూరు 572, తూర్పుగోదావరి 1,423, గుంటూరు 641, కడప 661, కృష్ణ 398, కర్నూలు 314, నెల్లూరు 820, ప్రకాశం 979, శ్రీకాకుళం 678, విశాఖపట్నం 574, విజయనగరం 532, పశ్చిమ గోదావరి 955 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో ప్రకాశం 10, చిత్తూరు 9, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణ 6, కడప 5, విశాఖపట్నం 5, గుంటూరు 4, నెల్లూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, కర్నూలు 3, శ్రీకాకుళంలలో ముగ్గురు మరణించారు.