Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో కరోనా విజృంభణ... అసెంబ్లీలో అప్రమత్తం

ఈ నెల 16తేదీ(రేపటి) నుంచి ఏపీ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో  వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.    

corona outbreak in AP... Special Precautions Budget Sessions
Author
Amaravathi, First Published Jun 15, 2020, 11:42 AM IST

అమరావతి: ఈ నెల 16తేదీ(రేపటి) నుంచి ఏపీ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో  వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.      అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్‌ జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్ర లెజిస్లేచర్‌ కార్యదర్శికి ప్రత్యేక నోట్‌ పంపించారు. ఆ నోట్‌ ఆధారంగా లెజిస్లేచర్‌ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సభ్యులకు అసెంబ్లీ ప్రాంగణం, సమావేశ మందిరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు.  

''సభ్యులందరూ తప్పనిసరిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలి. సభా మందిరంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రపర్చుకోవాలి. సభా ప్రాంగణంలో ప్రవేశించే ముందుగానే ఉష్ణోగ్రతను తెలిపే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. లాబీలు, గ్యాలరీల్లో సభ్యులు గుమిగూడకూడదు. లిఫ్ట్‌లో ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. సభా మందిరంలో సభ్యులు రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి'' అని సూచించారు. 

read more   రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీఎల్పీ భేటీ, వ్యూహాంపై చర్చ

''జ్వరం, దగ్గు, ఆయాసం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 60 ఏళ్ల వయసు దాటిన సభ్యులు, మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కోవిడ్‌–19 వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి సమస్యలున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి'' అని కార్యదర్శి సూచించారు. 

''మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌వోలను తీసుకురాకూడదు. అలాగే ఈ సమావేశాల్లో సందర్శకులను అనుమతించరు. అసెంబ్లీ ఆవరణలో ఆందోళనలకు అనుమతి లేదు'' అని కృష్ణమాచార్యులు సూచించారు. 

ఈ నెల 16 ఉదయం 9 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే  2020-21 కి సంబంధించిన బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెల్పనుంది. 11గంటలకు వీడియో కాన్ఫెరెన్సు లో గవర్నర్ ప్రసంగించనున్నారు. 12.30 కి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే  తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 1 కి ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios