ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూస్తున్న కరోనా కేసులు ప్రజలను కంగారుపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులు, విజయవాడ హాస్సిటల్ వైద్యురాలికి కరోనా సోకింది.
Covid 19 : కరోనా మహమ్మారి మరోసారి మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా విజృంభించగా తాజాగా భారతదేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేలకు చేరగా తెలుగు రాష్ట్రాల్లో పదులకు చేరింది…రోజురోజుకు కొత్తకేసులు బైటపడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా బారినపడ్డ ఓ మహిళ ప్రాణాలుకోల్పోగా ఓ డాక్టర్, ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో గత సోమవారం రాత్రి ఏలూరుకు చెందిన మరియమ్మ (70) అనే వృద్ధురాలు చేరింది. వేరే అనారోగ్య కారణంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకురావడంతో వైద్యులు కరోనా జాగ్రత్తలు పాటించకుండా చికిత్స అందించారు. కానీ ఆమె తీవ్ర జ్వరంతో బాధపడటంతో అనుమానం వచ్చిన వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చింది. పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆమె మరణించారు.
అయితే ఇదే హాస్పిటల్లో పనిచేసే ఓ డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమెను క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో కరోనా కేసులు బైటపడటంతో పేషెంట్స్, వైద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలావుంటే ఏలూరు కలెక్టరేట్ లో కూడా కరోనా కలకలం రేగింది. వివిధ విభాగాల్లో పనిచేసే ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఈ ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉండటంతో హోంఐసోలేషన్ ఉండి చికిత్స పొందాలని వైద్యులు సూచించారు. తోటి సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిసి ఏలూరు కలెక్టరేట్ లోని మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 1000 కరోనా కేసులు బైటపడ్డాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకేసారి 1,828 నుండి 2,710 కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,147 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మహారాష్ట్రలో 424, డిల్లీలో 494, గుజరాత్ లో 223 కేసులున్నాయి. కరోనాతో ఏడుగురు మరణించారు.