ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజులు పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజులు పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఎం జగన్‌ గురువారం(మార్చి 2) రోజున విశాఖపట్నం చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు సీఎం జగన్ అక్కడే బస చేయనున్నారు. ఏపీ గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. 

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ వేదికగా రాష్ట్రంలోని వనరుల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించడంతో పాటుగా.. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. భారత్ నుంచే కాకుండా విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కూడా ఏపీ ప్రభుత్వం ఈ సమ్మిట్‌కు ఆహ్వానించింది. దేశంలోని వివిధ నగరాల్లో రోడ్‌షోలను కూడా నిర్వహించింది. సీఎం జగన్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ‌సన్నాహక సదస్సుల్లో పాల్గొన్నారు. 

ఇక, విశాఖపట్నం కేంద్రం పాలన సాగించాలని భావిస్తున్న వైఎస్ జగన్ సర్కార్.. అక్కడ నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వాహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తాడేపల్లి నుంచే సమీక్షిస్తున్నారు. సోమవారం రోజున గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం జగన్.. వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమ షెడ్యూల్‌ను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

‘‘మార్చి 3,4 తేదీల్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విశాఖపట్నంలో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అందం, చైతన్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రతి ఒక్కరూ రావాలని నేను ఆహ్వానిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.