Asianet News TeluguAsianet News Telugu

సంక్షేమం, అభివృద్ధి బాటలో మరో ముందడుగు... నేడే రూ.450 కోట్లు విడుదల

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేస్తోంది. లాక్ డౌన్ కారణంగా కుదేలయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు చేయూతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహక మొత్తం విడుదల చేస్తోంది. 

CM YS Jagan Mohan Reddy to release SMSE Restart package today
Author
Amaravathi, First Published May 22, 2020, 10:52 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేస్తోంది. లాక్ డౌన్ కారణంగా కుదేలయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు చేయూతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహక మొత్తం విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 98 వేల ఎంఎస్‌ఎంఈలకు కొండంత అండలా నిలుస్తూ శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ రూ.450 కోట్ల ప్రోత్సాహక మొత్తం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు అన్నింటికీ మొత్తం రూ.905 కోట్లు ప్రోత్సాహకంగా ఇవ్వాల్సి ఉండగా, తొలి విడతగా ప్రభుత్వం రూ.450 కోట్లు విడుదల చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని అతి త్వరలోనే చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. 

 దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 8 శాతం, వస్తు ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎంఎస్‌ఎంఈలది కావడం విశేషం. ఇంకా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఈ రంగమే ఉపాధి కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలు ఇంకా అభివృద్ధి చెందితే దేశ సామాజిక ఆర్థిక పురోగతికి మరింత ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 98 వేల ఎంఎస్‌ఎంఈలు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రాష్ట్ర స్థూల జాతీయత్పత్తి (జీఎస్డీపీ)తో పాటు, రాష్ట్రం నుంచి ఎగుమతుల్లోనూ ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోంది.

అయితే అధిక వడ్డీలకు రుణాలు, ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇబ్బందులు, నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత, ఉత్పత్తుల అమ్మకం, మార్కెట్‌లో ఒడిదుడుకులు, తద్వారా ఆర్థిక సమస్యలు వంటివి ఎంఎస్‌ఎంఈలను నష్టాలకు గురి చేస్తున్నాయి.ఇంకా నూతన పారిశ్రామిక విధానంలో ప్రకటించిన హామీలు నెరవేర్చడంలో తీవ్ర ఆలస్యం కూడా ఎంఎస్‌ఎంఈల కష్టాలను మరింత పెంచింది.

ఆహారం, ఆగ్రో ప్రాసెసింగ్, జౌళి ఆధారిత ఉత్పత్తులు, భవన నిర్మాణ సామాగ్రి తయారీ, గ్రానైట్, కట్టింగ్‌ పాలిషింగ్‌ యూనిట్లు, రసాయనాలు–ఔషథాలు, ఇంజనీరింగ్‌ సామాగ్రి, కొబ్బరిపీచు ఉత్పత్తులు, పేపర్‌ ప్రింటింగ్, లెదర్‌ ఉత్పత్తులు, ప్లాస్టిక్‌ పాలిమర్స్, ఇనుము, ఉడ్‌ ఫర్నీచర్‌.. తదితర రంగాలలో రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు కీలకంగా నిలుస్తున్నాయి. 

READ MORE  అయిపోయిన పెళ్లికి బాజాల్లా...సాయం ప్రకటించాక డిమాండా..!: పవన్ పై వెల్లంపల్లి సెటైర్లు

కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగంపై ఆ ప్రభావం మరింతగా ఉంది. వాటి వాణిజ్య కార్యకలాపాలు.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బ తిన్నాయి.ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలలో ఎంఎస్‌ఎంఈలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఈ రంగం పూర్తిగా కోలుకునేలా ఏం చేయాలన్న వాటిపై తగిన ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పరిశ్రమ ఏర్పాటుతో పాటు, సాంకేతికపరంగానూ, మార్కెటింగ్‌ పరంగానూ, రుణాలు పొందడంలోనూ, ముడి సరుకుల సరఫరా.. చివరకు నీరు, విద్యుత్‌ వినియోగం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఎంఎస్‌ఎంఈలకు తోడుగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, వాటిని అమలు చేస్తారు.

ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని సమస్యలను గత నెల 30న సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్‌ఎంఈలకు పెండింగులో ఉన్న ప్రోత్సాహకాల మొత్తం రూ.905 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ.827.50 కోట్లు గత ప్రభుత్వం వదిలి పెట్టిన బకాయిలు ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు ఎంఎస్‌ఎంఈలకు మంజూరు చేసిన మొత్తాలను అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క ఏడాది కూడా ఆ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏ ప్రోత్సాహం లేక, పెట్టుబడులకు కూడా నిధులు లేక ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఫలితంగా అనేక పరిశ్రమలు మూతబడే స్థితికి చేరినట్లు  వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

READ MORE  నిరుద్యోగులకు శుభవార్త...ఆ ఉద్యోగాల్లో రాష్ట్ర యువతకే పెద్దపీట: మంత్రి గౌతమ్ రెడ్డి

అందుకే గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.827.50 కోట్లతో సహా ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు ఎంఎస్‌ఎంఈలకు అన్ని బకాయిలు క్లియర్‌ చేస్తూ రూ.905 కోట్లు ఒకేసారి మంజూరు చేయడం జరిగింది. అందులో సగం.. అంటే రూ.450 కోట్లు శుక్రవారం ఇస్తుండగా, మిగిలిన సగాన్ని అతి త్వరలోనే ఇస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. 2014–15 నుంచి పెండింగులో ఉన్న మొత్తాన్ని క్లియర్‌ చేయడం నిజంగా ఎంఎస్‌ఎంఈలకు ఒక చరిత్రాత్మక దినం అని సీఎం అభివర్ణించారు.

 ఇప్పుడు ఇస్తున్న మొత్తంలో సూక్ష్మ యూనిట్లకు 100 శాతం చెల్లింపు జరుగుతుండగా.. చిన్న, మధ్యతరహా యూనిట్లకు 50 శాతం చెల్లించినట్లు అవుతుంది. ఈ మొత్తంతో ఆయా యూనిట్లు ఉద్యోగుల జీతభత్యాల బకాయిలు చెల్లించడంతో పాటు, పెట్టుబడి, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల రుణ వాయిదాలు కూడా చెల్లించవచ్చు.

లాక్‌డౌన్‌ వల్ల పారిశ్రామిక రంగం బహుముఖ సవాళ్లు ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. పరిశ్రమలు నడవకపోయినప్పటికీ కిలో వాట్‌ విద్యుత్‌కు (ఎల్‌టీ, హెట్‌టీ కేటగిరీ వినియోగాన్ని బట్టి) రూ.75 నుంచి రూ.475 వరకు కనీస ఛార్జీ గతంలో వసూలు చేసేవారు.

అయితే లాక్‌డౌన్‌ సమయంలో పరిశ్రమలు పని చేయలేదు కాబట్టి, ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వాటి విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన కనీస ఫిక్స్‌డ్‌ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే కష్టాలలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం మూడు నెలల పాటు ఆ ఛార్జీలను రద్దు చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.188 కోట్ల భారం పడినా భరించింది.

అదే విధంగా భారీ మెగా పరిశ్రమలకు సంబంధించి, ఫిక్ప్‌డ్‌ డిమాండ్‌ ఛార్జీలలో మూడు నెలల పాటు ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుము వసూలు చేయరాదని నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఇది వర్తిస్తుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడిగా కేవలం 6 నుంచి 8 శాతం వరకు వడ్డీతో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఆ రుణ మొత్తాన్ని 6 నెలల మారిటోరియమ్‌ పీరియడ్‌తో సహా, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించింది. 

ఈ పరిశ్రమల కోసం సిడ్బి, ఐడీబీఐ ద్వారా రూ.200 కోట్ల నిధి సమీకరణ చేసింది. ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్‌) నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎదురయ్యే సమస్యలను కొంతమేర అయినా అధికమించేందుకు, ప్రభుత్వానికి ఏటా అవసరమైన 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో కనీసం 25 శాతం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఈ) నుంచే తీసుకోవాలని నిర్ణయించింది.  అందులో కూడా 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్‌ఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఎంఎస్‌ఈల నుంచి తీసుకున్న వస్తువులు, ఇతర సామాగ్రికి ఖచ్చితంగా 45 రోజుల్లో బిల్లుల చెల్లించనున్నారు. ఈ విధంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios