అయిపోయిన పెళ్లికి బాజాల్లా...సాయం ప్రకటించాక డిమాండా..!: పవన్ పై వెల్లంపల్లి సెటైర్లు
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బ్రాహ్మణులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద బ్రాహ్మణులను ఆదుకోవాలంటూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని కోరడంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా జవాభిచ్చారు. ఆల్రెడీ సాయం ప్రకటించాక పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం ఏంటీ...కామెడీ కాకుంటే..! అంటూ సెటైర్లు విసిరారు. ''అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకండి పవన్ కళ్యాణ్...లక్షల పుస్తకాలు చదివానన్న మీకు మతి పోయినట్లుంది'' అని ఎద్దేవా చేశారు.
''పురోహితులపై పవన్ కళ్యాణ్ కపట ప్రేమ చూపుతున్నారు. జగన్ అన్నది మనసున్న ప్రభుత్వం. హైదరాబాదులో కూర్చున్న పవన్ కళ్యాణ్ కళ్ళకు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిది'' అని మండిపడ్డారు.
read more నిరుద్యోగులకు శుభవార్త...ఆ ఉద్యోగాల్లో రాష్ట్ర యువతకే పెద్దపీట: మంత్రి గౌతమ్ రెడ్డి
''విజయవాడ వస్తే మీకు వాస్తవాలు కనబడతాయి. బ్రాహ్మణులకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా దేవాలయాలలో పనిచేసే పురోహితులకు వన్ టైమ్ కింద ఐదు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది'' అని గుర్తుచేశారు.
''సీఎం గారు 19వ తేదీ సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. అందులో మే నెల 26న అర్చకులకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కానీ రాజకీయ మనుగడ కోసం దీనిపై తమరు ఇవాళ పత్రికా ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలందరికీ నాలుగో విడుదల రేషన్ పంపిణీ చేయడం కూడా జరిగింది'' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.