అమరావతి: దేశంలో కోవిడ్‌ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు కూడా పూర్తి స్ధాయిలో నిర్వహించడం లేదని ఏపీ సీఎం జగన్ గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే వివరించారు. 

''కరోనా విజృంభిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిల్లుల కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కీలక బిల్లుల ఆమోదం కోసం ఎంత తక్కువ అయితే అంత తక్కువ రోజులు అసెంబ్లీ జరపాలనుకున్నాం. బిల్లుల ఆమోదానికి ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సి వుంటుంది కాబట్టి ఈ సెషన్‌ నిర్వహిస్తున్నాం'' అని అసెంబ్లీలోనే జగన్ వెల్లడించారు. 

''పరిస్థితులను గుర్తించకుండా ప్రతిపక్ష నాయకులు వితండవాదం చేస్తున్నారు. సభను ఎక్కువరోజులు నడపాలన్న వారి డిమాండ్ ఆమోదయోగ్యం కాదు. సభ జరగనివ్వకుండా చర్చకు అడ్డుపడుతూ ప్రతిపక్ష టిడిపి గందరగోళాన్ని సృష్టిస్తోంది. అందువల్లే టిడిపి సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరాల్సి వచ్చింది'' అని అన్నారు.. 

read more  కరోనాకు భయపడే నాయుడు, ఎందుకు రెచ్చిపోయాడో తెలియదు: బాబుపై జగన్ సెటైర్లు

''పాలకొల్లు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు తాము వివరణ ఇచ్చాం. ఆ వివరణ తర్వాత మళ్లీ పాలకొల్లు ఎమ్మెల్యే మాట్లాడాలి. ఆయనే టాపిక్‌ కంటిన్యూ చేయాలి. కానీ నేను మాట్లాడతాను అని చెప్పి సడెన్‌గా ఒక ప్రతిపక్ష నాయకుడు లేచి మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇట్‌ నెవర్‌ హ్యాపెండ్‌'' అంటూ చంద్రబాబు వ్యవహారశైలిని తప్పుబట్టారు. 

''బుల్డోజ్‌ చేసి, రౌడీయిజమ్‌ చేసి, కళ్లు ఇంతింత పెద్దవి చేసి, మా కర్నూలు ఎమ్మెల్యే పోతే ఏం పీకుతారని అని చెప్పి ఒక పెద్దమనిషి అన్నాడు. అసలు ఆయన వయసుకు తగ్గ బుద్ధి, జ్ఞానం ఉండాలి. వయసుకు తగ్గ బుద్ది లేదు. ఇష్టం వచ్చినట్లు చేయి చూపిస్తాడు. కళ్లు పెద్దవి చేస్తాడు. అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చాం. ఇది రౌడీయిజమ్‌ కాకపోతే ఏంటిది అధ్యక్షా. ఇది పద్ధతిలో జరగదు.  రైతులకు ఏం చేస్తారో చెబుతామని రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మార్షల్స్‌ను రప్పించి, పరిస్థితి చక్కదిద్దండి'' అని సీఎం వైయస్‌ జగన్‌ స్పీకర్ ను కోరారు. అనంతరం స్పీకర్ టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు.