అమరావతి: చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయాడో తనకు అర్ధం కాలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని బాబు మీడియాలో ప్రచారం కోసం అసెంబ్లీలో డ్రామాలు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో  పంట నష్టంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసిన విషయమై  ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వరద సహాయంపై ప్రకటన చేసే సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.ఇవాళ చంద్రబాబునాయుడు ఎందుకు అలా రెచ్చిపోయాడో అర్ధం కాలేదన్నారు. రైతులపై ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

also read:డిసెంబర్ 31లోపుగా రైతులకు పరిహారం: అసెంబ్లీలో జగన్ హామీ

సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అంటూ సెటైర్లు వేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎక్కడ వరదలు వచ్చినా తాను అక్కడికి వెళ్లి రైతులను పరామర్శించినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  తాను ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని.. కానీ ఏనాడూ కూడా  స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగలేదన్నారు. 

వరదలు వచ్చిన సమయంలో రైతుల వద్దకు ఏనాడూ కూడ చంద్రబాబు వెళ్లలేదన్నారు. వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లోనే ఉన్నాడని ఆయన చెప్పారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా  కన్నీరు పెట్టకూడదనేది తమ అభిమతమని ఆయన చెప్పారు.రైతులను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని ఆయన చెప్పారు.