2.06 లక్షల ఉద్యోగాల్లో కాపు సామాజిక వర్గానికి 9.5 శాతం దక్కాయి..: కాపు నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్
కాపు నేస్తంతో 4 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కాపు పేద మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు.

కాపు నేస్తంతో 4 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కాపు పేద మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు. వరుసగా నాలుగేళ్లుగా కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 2 వేల 29 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కాపు నేస్తం కింద నేడు రూ. 536 కోట్ల నిధులను అక్కాచెల్లమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు.
రెండు లక్షల ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే.. కాపు సామాజిక వర్గానికి 9.5 శాతం దక్కాయని చెప్పారు. తన రెండు కేబినెట్‌లలో కూడా కాపు వర్గానికి చెందిన వ్యక్తికి ఉప ముఖ్యమంత్రిని చేసి పక్కనే కూర్చొబెట్టుకున్నానని చెప్పారు. నామినేటేడ్ పోస్టుల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు.
Also read: స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే.. అడ్డంగా దొరికినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు: సీఎం జగన్
తాను ఎప్పుడూ మోసం చేయబోనని సీఎం జగన్ తెలిపారు. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తానని మేనిఫెస్టోలో చెప్పామని.. ఈ నాలుగేళ్లలో అంతకు మించి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 39, 227 కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో కాపులను మోసం చేసిందని అన్నారు.
మొత్తంగా తమ పాలనలో 52 నెలల కాలంలో 2.35 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి అక్కాచెల్లమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ‘‘న్యాయం, ధర్మం, మీ బిడ్డ పక్షాన ఉన్నాయి.. అన్యాయం, మోసం, వెన్నుపోట్లు వారి వైపు ఉన్నాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, ప్రజలనే. మీకు మంచి జరిగిందా అనేది కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే బిడ్డకు సైనికులుగా నిలబడండి’’ అని సీఎం జగన్ కోరారు.