అమరావతి: పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)‌‌యాప్‌ను   సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్‌ కూడా ఆయన రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసు ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లు అందజేశారు సీఎం జగన్.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ...పోలీసులు అంటే సేవకులని... వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి, వారిని ఆశ్రయించవచ్చని...ప్రజల్లో ఆ ఆత్మ విశ్వాసం పెంచడం కోసం ఈ యాప్‌ గొప్పగా ఉపయోగపడుతుందన్నారు. 

''పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, వారికి రోజంతా అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్‌ రూపొందించడం జరిగింది. పోలీసులు అంటే ఒక బలగంగా లేదా ఒక శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్‌ ఫ్రెండ్లీకి అర్ధం. ఇప్పుడు 87 రకాల సేవలు, ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారానే అనేక సేవలు పొందవచ్చు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది'' అన్నారు. 

read more  వైసీపీలోకి గంటా పక్కా, జగన్ ప్లాన్ ఇదీ..: మరో నలుగురికి గాలం

''సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతుంది. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు'' అని వివరించారు. 

''రోడ్‌ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్‌ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా దాన్ని రిపోర్టు చేయడంతో పాటు ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. సైబర్‌ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్‌ ఉపయోగపడుతుంది. చివరకు సోషల్‌ మీడియా సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్స్‌ చెక్‌ అన్న ఫీచర్‌ కూడా ఇందులో ఉంది'' అని తెలిపారు. 

''పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే పోలీసు సేవలు గ్రామగ్రామానికి చేరాయి. 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాము.  వారి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో అన్నీ అనుసంధానం చేస్తున్నాం. గ్రామ పోలీసులను ఇందులో అనుసంధానం చేశాం'' అని పేర్కొన్నారు. 

''దేశంలోనే తొలిసారిగా దిశ యాప్‌. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 యఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం'' అని వెల్లడించారు. 

''పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం. నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు సున్నా చేయడమే లక్ష్యం. అందుకే ఈ వ్యవస్థ. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థ తెచ్చాము.  వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్‌ఐఆర్‌ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. ఆ దిశలో పూర్తి పారదర్శకంగా ముందుకు అడుగుల వేస్తేనే సామాన్యులకు మేలు జరుగుతుంది. న్యాయం జరుగుతుంది. ఆ దిశలోనే ఒక అడుగు ముందుకు వేస్తూ, ఇవాళ ఈ యాప్‌ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది'' అన్నారు. 

''చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారా పొందవచ్చు. చట్టాన్ని కాపాడడం కోసమే పోలీసులు అధికారాలు ఉపయోగించాలి. మరోసారి గుర్తు చేస్తున్నాను. ప్రజలు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, సేవలు పొందాలి. వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దీని వల్ల ప్రజలకు మంచి జరగాలని దేవుణ్ని కోరుకుంటున్నాను'' అని జగన్ వెల్లడించారు.