విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మంత్రి అవంతి శ్రీనివాస రావుతో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి గంటాను అడ్డగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వారిద్దరి మాటను కూడా కాదని గంటాకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఆయన వైసీపీలో చేరుతారని అంటున్నారు. 

పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు, ఇతర నాయకులకు తమ పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమారులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వాసుపల్లి గణేష్ సాంకేతికంగా వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీ వెంట నడుస్తారు. 

2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయదుందుభి మోగించింది. అయితే, విశాఖనగరంలో నాలుగు స్థానాల్లో వైసీపీ ఓటమి పాలైంది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గాల్లో విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంటే విశాఖపట్నంలో తిరుగు ఉండదని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర ఎమ్మెల్యేలపై గురి పెట్టినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాుగతోంది. నియోజకవర్గంలో ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉన్నందున, అది తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయన వైసీపీలో చేరుతారని అంటున్నారు. 

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు వైసీపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, కరణం బలరాం ఆయనను వైసీపిలోకి తీసుకుని వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం పచ్చజెండా ఊపలేదని సమాచారం.

గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును కూడా తమ పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశపెట్టినట్లు తెలుస్తోంది. లేదంటే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.