Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్ సురేంద్ర హత్య : నంద్యాల వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, శిల్పాపై మలికిరెడ్డి ఆరోపణలు

నంద్యాల జిల్లా అధికార వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. 
 

clashes between nandyala mla shilpa ravichandra kishore reddy and Malikireddy Rajagopal Reddy
Author
First Published Sep 24, 2022, 8:23 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. తమ పార్టీలను పటిష్టం చేసేందుకు యత్నాలు ముమ్మరం చేశాయి. అయితే అధికార వైసీపీలో మాత్రం నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూల వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజాగా నంద్యాల జిల్లాలో నేతల మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. 

అసలేం జరిగిందంటే..

ఇటీవల నంద్యాలలో రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సురేంద్రను చంపిన నిందితులను కడప సెంట్రల్ జైలులో ఎమ్మెల్యే రవిచంద్ర పరామర్శించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. దీనిపై భగ్గుమన్న ఎమ్మెల్యే.. తాను కడప సెంట్రల్ జైలుకు వెళ్లినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 

ఆ వెంటనే స్పందించిన మలికిరెడ్డి.. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రవిచంద్రపై విమర్శలు గుప్పించారు. తాను ఆధారాలు చూపించినా తన పలుకుబడితో ఎమ్మెల్యే వాటిని అవాస్తవాలుగా తేలుస్తారని ఆరోపించారు. నంద్యాలలో రౌడీషీటర్లకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర అండగా నిలుస్తున్నారని మలికిరెడ్డి ఆరోపించారు. పట్టణంలో జరిగిన హత్యలకు , శాంతిభద్రతలకు విఘాతం కలగడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆయన అన్నారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పగించాలని.. ఈ విషయంపై కావాలంటే ఇద్దరం కలిసి సీఎం జగన్‌ను కలుద్దామని మలికిరెడ్డి వ్యాఖ్యానించారు. 

ALso REad:కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు : నిఘా వైఫల్యం వల్లే దారుణం.. సీఐ, ఏఎస్సైలపై వేటు

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, అబ్ధుల్ ఘనీ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా అక్కడ అసమ్మతి వర్గాలు ఒక్కటవుతున్నాయి. మొన్నామధ్య ప్రెస్ క్లబ్ వేదికగా నేతల మధ్య రాళ్ల దాడి సైతం జరిగింది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. వీరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్. దీంతో మూడు వర్గాలను మంత్రి అమరావతికి పిలిపించి మాట్లాడారు. 

అయితే సయోధ్య కోసం పిలిస్తే వీరంతా మంత్రి స‌మ‌క్షంలోనే బాహాబాహీకి దిగారు. పెద్దిరెడ్డి వారించ‌డంతో వెన‌క్కు త‌గ్గిన నేతలు ప‌రస్ప‌రం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇక్బాల్ వ‌ర్గంపై న‌వీన్ నిశ్చ‌ల్‌, అబ్దుల్ ఘ‌నీలు మూకుమ్మ‌డిగా కంప్లయంట్ చేశారు. హిందూపురం స‌మ‌న్వ‌క‌ర్త‌గా ఇక్బాల్‌ను కొన‌సాగిస్తే తాము ప‌నిచేయ‌లేమ‌ని వారు కుండబద్ధలు కొట్టారు. ఇక్బాల్ కార‌ణంగా తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆరోపించారు. హిందూపురం వైసీపీలో సాధారణ పరిస్ధితులు రావాలంటే ఇక్బాల్‌ను త‌ప్పించాల్సిందేన‌ని వారు తెగేసి చెప్పారు. స్థానికేత‌రుడైన ఇక్బాల్‌కు ఈసారి హిందూపురం టికెట్ ఇవ్వొద్దని పెద్దిరెడ్డికి వారు సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios