కుంభకోణంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల హస్తం కూడా ఉందని ప్రకటించటం పార్టీ, ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. పైగా వలస వచ్చిన వారే భూఅక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పటంతో చింతకాయల ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అందరికీ తెలిసిపోతోంది.
నిత్యమూ పారదర్శకత, నీతి, నిజాయితీ అంటూ ఊదరగొడుతున్న చంద్రబాబునాయుడుకు మంత్రివర్గ సహచరుడే పెద్ద షాక్ ఇచ్చారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే యధేచ్చగా భూ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ చెప్పటం సంచలనంగా మారింది.
ఈ విషయమై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించినా చింతకాయల ఖాతరు చేయకపోవటం పార్టీ, ప్రభుత్వంలో పెద్ద చర్చగా మారింది. విశాఖపట్నం జిల్లాలోని వివిద నియోజకవర్గాల్లో సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన వేలాదిఎకరాల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే కదా? దాని గురించే చింతకాయల దీక్ష సందర్భంగా ప్రస్తావించారు.
రూ. 25 వేలకోట్ల భూ కుంభకోణం జరిగిందంటే మామూలు విషయం కాదుకదా? అధికారపార్టీలోని ఎంతమంది ప్రముఖుల హస్తం లేకపోతే ఆ స్ధాయి భూదందా జరుగుతుంది? ఇప్పటి వరకూ పలువురు తహశిల్దార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, అధికారపార్టీకి చెందిన ఒక్కరి పాత్ర కూడా ఇంత వరకూ బయటపడలేదు.
ఆ విషయాన్నే చింతకాయల మాట్లాడుతూ, కుంభకోణంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల హస్తం కూడా ఉందని ప్రకటించటం పార్టీ, ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. పైగా వలస వచ్చిన వారే భూఅక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పటంతో చింతకాయల ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అందరికీ తెలిసిపోతోంది.
ఎందుకంటే, వేలకోట్ల కుంభకోణంలో పార్టీలోని ప్రముఖుల మద్దతు లేకుండా కేవలం అధికారులే చక్కబెట్టలేరన్న విషయం తెలిసిందే కదా? అదే విషయమై వైసీపీ కూడా ఆరోపిస్తోంది. వేలకోట్ల భూకుంభకోణం వెనుక మంత్రుల హస్తముందంటూ వైసీపీ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది.
ఇపుడు మంత్రి మాటలు వైసీపీ ఆరోపణలకు మద్దతిస్తున్నట్లే ఉంది. ఈనెల 15వ తేదీన కుంభకోణంపై బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే పెద్దల హస్తం బయటపడే అవకాశం ఉంది. మరి విచారణ ఎలా జరుగుతుందో చూడాలి.
