విజయవాడ: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాదులోని ఆయన ఇంటి వద్ద గల సిసీటీవీ ఫుటేజీలను నందిగామ పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులను, బంధువులను ప్రశ్నిస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత లావాదేవీల కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జయరామ్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇదిలావుంటే, చిగురుబాటి హత్యకు సంబంధించి ఆయన డ్రైవర్ సతీష్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. చిగురుపాటి జయరాం దారుణ హత్య కేసు మిస్టరీగానే మారింది. ఆయన చంపి తీసుకుని వచ్చారా, తీసుకుని వచ్చి చంపేశారా అనేది తెలియడం లేదు. హైదరాబాద్‌ నుంచి ఆయనొక్కరే ఒంటరిగా కారులో బయలుదేరారని చెబుతున్నారు. కానీ టోల్‌ప్లాజా సీసీటీవీల్లో ఓ తెల్లరంగు చొక్కా ధరించిన వ్యక్తి కారును నడిపినట్లు చూపిస్తోంది. 

ఆ కారులో ఉన్న మరో వ్యక్తి ఎవరనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో బీరు సీసాలు ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఎవరితోనేనా కలిసి జయరాం పార్టీ చేసుకున్నారా అనేది ప్రశ్నగానే మిగిలింది. పార్టీ చేసుకున్న తర్వాత అతన్ని చంపేసి ఉంటారా అనేది కూడా తేలాల్సి ఉంది.

అయితే చిగురుపాటి జయరాం కారు డ్రైవర్ చెబుతున్న విషయాలు కేసును మలుపు తిప్పే అవకాశం ఉంది. చిగురుబాటికి బయట మద్యం తీసుకునే అలవాటు లేదనీ, అసలు బీరు తాగరని కారు డ్రైవర్ సతీష్ చెప్పాడు. జయరాం కారు డ్రైవర్‌ సతీశ్‌ను కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి 4 గంటల పాటు విచారించారు. జయరామ్‌ కారులో పోలీసులకు బీరు బాటిళ్లు లభ్యమయ్యాయి. దీనిపై సతీశ్‌ను ఆరా తీశారు. 

చిగురుపాటి బీరు సేవించరని, బయట అసలు మద్యం ముట్టుకోరని, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మద్యం సేవిస్తారని అతను చెప్పాడు. అంతేకాకుండా రాత్రి వేళల్లో అసలు ప్రయాణం చేయరని చెప్పాడు. ఆయనకు పెద్దగా శత్రువులు ఉన్నట్లు కూడా తనకు తెలియదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు