విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మృతి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కారు వెనక సీట్లో ఆయన మృతదేహం పడి ఉంది. తలపై గాయాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిగురుపాటి జయరామ్ వారం రోజుల క్రితం విజయవాడ వచ్చారు. సాధారణంగా ఆయన డ్రైవర్ లేకుండా ఎక్కడికీ వెళ్లరని అంటారు. అయితే, కారును నడిపిన డ్రైవర్ ఎవరు, విజయవాడలో ఆయన ఎవరెవరిని కలిశారు అనే విషయాలు తేలాల్సి ఉంది. 

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన జయరామ్ అంచెలంచెలుగా ఎదిగారు. కోస్టల్ బ్యాంక్ అధినేతగా, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండిగా ఆయన సుపరిచుతులు. అమెరికాలోని ఓ బ్యాంకులో కూడా ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఔషధాలు, అద్దాల తయారీ కేంద్రాలు కూడా ఆయనకు ఉన్నాయి. 

ఆయన భార్యాపిల్లలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. వ్యాపార లావాదేవీల్లో విభేదాల వల్ల ఆయనను ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

"

సంబందిత వార్త

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు