చంద్రబాబునాయుడు నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. మూడు రోజుల క్రితం కేంద్రప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో టిడిపి నేతలు కేంద్రంపై మండిపడుతున్న సంగతి అందరకీ తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం పార్టీ ఎంపిలు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులతో అత్యవసర సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఎంపిలదే కీలక పాత్రగా ఉండబోతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయోజనాలపై ఒక్క మాట కూడా లేదు. దాంతో రాష్ట్రంలో భాజపా తప్ప మిగిలిన పార్టీలు, జనాలు మండిపోతున్నారు.

ఈ నేపధ్యంలోనే భాజపాతో పొత్తు వదులుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికలకు ముందు మొన్న ప్రవేశపెట్టిందే పూర్తిస్ధాయి బడ్జెట్. మొన్నటి బడ్జెట్లోనే ఏపి విషయాలేవీ ప్రస్తావించలేదంటే కేంద్రం నుండి ఇక రాష్ట్రానికి రాబోయేదేమీ లేనట్లే. ఇక్కడే టిడిపికి మండిపోతోంది.

మూడున్నరేళ్ళుగా కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా అవమానాలన్నింటినీ దిగమింగుకుని చంద్రబాబు మాట్లాడకుండా కూర్చున్నారు. అందుకు కారణం భాజపాతో పొత్తు వద్దనుకుంటే ఎక్కడ కేసులు మెడకు చుట్టుకుంటాయో అన్న భయం. ‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం పుణ్యమా అని కేసు విచారణ జరగటం లేదు.  భాజపాతో పొత్తు వద్దనుకున్న మరుక్షణం కేసు విచారణ మొదలైతే చంద్రబాబు పరిస్ధితి అంతే సంగతులు.

భాజపాను వద్దనుకుంటే ఏమి జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే పార్టీ నేతలు పొత్తులపై చంద్రబాబు మీద ఎంత ఒత్తిడి తెస్తున్నా మాట్లాడకుండా ఉంటున్నది అందుకనే. అయితే, ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా పొత్తులపై నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా దెబ్బ పడటం ఖాయం. కాకపోతే వ్యక్తిగత ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. అందుకే పార్టీ నేతలతో అత్యవసర సమావేశం పెట్టారు. సమావేశంలో  ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.