మోడీని టార్గెట్ చేసిన చంద్రబాబు: వ్యూహం ఇదీ...

మోడీని టార్గెట్ చేసిన చంద్రబాబు: వ్యూహం ఇదీ...

అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాకుండా, ప్రధాని మోడీపై, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై నిప్పులు చెరిగారు. మోడీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బిజెపిని గెలిపించకూడదని కూడా పిలుపునిచ్చారు.

మూడు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు బిజెపిని లక్ష్యం చేసుకున్న తీరు స్పష్టంగా కనిపించింది. తనకు వచ్చే ఎన్నికల్లో సవాల్ విసరడానికి సిద్ధపడిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మధ్య మధ్యలో విమర్శిస్తూ వచ్చారు. వారి వ్యవహార శైలికి కూడా బిజెపినే తప్పు పట్టారు. బిజెపి నాటకంలో భాగంగానే వారు పనిచేస్తున్నారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అంత బలంగా లేని విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీదారు అయ్యే అవకాశాలు కూడా లేవు. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు బిజెపిని లక్ష్యం చేసుకోవడంలోని వ్యూహం ఏమిటనేది ఆలోచించాల్సిన విషయమే.

గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీకి సవాల్ గానే నిలిచారు. ఒక స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుస్తుందనే మాట కూడా వినిపించింది. అయితే, చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఎన్నికల ప్రచారంలో వేదికను పంచుకున్నారు. వారికి తోడుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. 

రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యల నుంచి ఆ కూటమి బయటపడేస్తుందనే నమ్మకాన్ని వారు కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. అప్పట్లో యువతలో నరేంద్ర మోడీ పట్ల పెద్ద యెత్తున ఆకర్షణ కూడా ఉంది. పవన్ కల్యాణ్ రాకతో సామాజిక సమీకరణల్లో మార్పు వచ్చింది. అవన్నీ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. 

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2019లో ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు పక్కా వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి అవసరమైన వ్యూహరచన చేసి అమలు చేయాల్సిన అనివార్యతలో ఆయన పడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి నిర్మాణం వంటి పలు హామీలు అమలు కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వం కారణమనే విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వారి సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. తప్పంతా బిజెపి మీదికి, కేంద్ర ప్రభుత్వం మీదికి నెట్టేస్తే ప్రజలు తనను నమ్ముతారని ఆయన అనుకుంటున్నట్లు భావించవచ్చు. తాను ఎంత చేసినా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయడం వల్లనే హామీలు నెరవేర్చలేకపోయానని చెప్పదలుచుకున్నారు. 

దీన్నిబట్టి చూస్తే, ఆయన నెగెటివ్ ఓటు బ్యాంకును తగ్గించుకుని, పాజిటివ్ ఓటు బ్యాంకును కాపాడుకునే ఉద్దేశంతో ఉన్నారని అర్థమవుతోంది. జగన్, పవన్ కల్యాణ్ కూడా బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు. వారి విషయంలోనూ ఆయన బిజెపినే ఎత్తిచూపుతున్నారు. దాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబుకు అంతకు మించిన మార్గం ఏదీ లేదు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page